మనసుల మధ్య సంఘర్షణ

రెండు రోజుల కిందట అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన కాదల్ సినిమా సమాజంపై కేరళ వాసుల దృక్పధాన్ని చూపిస్తుంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పాత్రధారిగా నటించారు. ఈ సినిమాలో హీరోలు ఉండరు. ఓ సామాజిక సమస్యే హీరో. సమాజంలో సంకుచిత స్వభావమే విలన్. తనకు నచ్చిన దారిలో తాను వెళ్లిపోవడమే ఎండ్.

Update: 2024-01-09 13:35 GMT

రెండు రోజుల కిందట అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన కాదల్ సినిమా సమాజంపై కేరళ వాసుల దృక్పధాన్ని చూపిస్తుంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పాత్రధారిగా నటించారు. ఈ సినిమాలో హీరోలు ఉండరు. ఓ సామాజిక సమస్యే హీరో. సమాజంలో సంకుచిత స్వభావమే విలన్. తనకు నచ్చిన దారిలో తాను వెళ్లిపోవడమే ఎండ్. మాధ్యుస్ పాత్రలో మమ్ముట్టి, అతని భార్య ఊమనిగా జ్యోతిక (ప్రముఖ తమిళ్ హీరో సూర్య భార్య) నటించారు. దాదాపు రెండు గంటలపాటు నడిచే ఈ సినిమా కొన్ని విషయాలపై మన సమాజాన్నిసూటిగా ప్రశ్నిస్తుంది. ఇందులో మమ్ముట్టి గే (హోమోసెక్సువల్ )పాత్ర పోషించారు. అతను గే అని తెలిసినా 20 సంవత్సరాల పాటు భార్య కాపురం చేస్తుంది. చివరకు విడాకులు తీసుకుంటుంది.

మన సమాజంలో ఎల్ జి బి టి (లెస్బియన్స్, గేస్, బైసెక్సుల్స్ అండ్ ట్రాన్స్ జెండర్స్) అంటే ఓ చిన్న చూపు ఉంది అప్పుడెప్పుడో పాత సినిమాలో 'చూడు పిన్నమ్మ పాడు పిల్లోడు' అని మాడా వెంకటేశ్వరరావు అనే నటుడు చేత పాట పాడించి నవ్వుకున్న దిక్కుమాలిన ప్రపంచం మనది. నపుంసకత్వానికి మాడాను ఇంటిపేరుగా మార్చిన భావజాలం మనది. విభిన్న ఆలోచనని పంచుకోలేని, అంగీకరించలేని 'సంప్రదాయం' మనది.

ఒక మెగాస్టార్ గే పాత్ర పోషించడం ఒక గొప్ప విషయం. మమ్ముట్టి సటిల్ పెర్ఫార్మెన్స్ మరో అద్భుతం. స్వలింగ సంపర్కం తప్పు కాదని అతని అంతరాత్మ చెబుతుంది. ఆ నిజాన్ని సమాజం అంగీకరించదనే వాస్తవాన్ని అతని అనుభవం చెబుతుంది. తనను శారీరకంగా దూరం పెడుతున్న భర్త నుంచి ఊమని విడాకులు కోరుకుంటుంది. కోర్టులో కేసు ఫైల్ అయిన తర్వాతే... ఇరుగు పొరుగుకి మమ్ముట్టి గురించి నిజం తెలుస్తుంది. అతను వార్డు ఎన్నికల్లో పోటీ చేస్తారు. హీరో ఓ గే అనే విషయాన్ని ఎన్నికల అంశంగా మార్చడానికి అప్పోజిషన్ ప్రయతిస్తూ ఉంటుంది. కానీ ఓటర్లు ఈ విషయాన్ని పట్టించుకోరు. కేసు విషయం తెలిసిన తర్వాత అతనితో పాటు పార్ట్నర్ కూడా అవమానాలు ఎదుర్కొంటాడు. చివరికి కోర్టు మాధ్యుస్,  ఊమని విడాకులకు అంగీకరిస్తుంది. ఊమని వేరే వ్యక్తితో పెళ్ళికి సిద్ధం కావడం, మాధ్యుస్  తన పార్ట్నర్ తో వెళ్లిపోవడం.. అప్పుడే ఒక ఇంద్రధనస్సు వెల్లివిరియడం..ఇవన్నీ కేరళ ఆధునిక ధోరణులకు అద్దం పడతాయి.

సినిమాని ఒక మాధ్యమంగా, ఒక కళగా కేరళ సమాజం చూస్తుంది. అది వాళ్లకు ఆదాయ మార్గం ఒక్కటే కాదు. ఓటీటీలు వచ్చిన తర్వత మలయాళం సినిమాలు మనకి అందుబాటులోకి వచ్చాయి.  ఆ సినిమాలు చూస్తే అక్కడి నటులు, నిర్మాతలు, దర్శకుల ఆలోచనా ధోరణికి ఆశర్య పడతాము. 70 ఏళ్ల వయసులో కూడా డాన్సులు చేయాలని, తొడగొట్టి సుమోలు ఎగరవేయాలని, తన మనవరాలు వయసు ఉండే అమ్మాయిలతో రొమాన్స్ చేయాలనీ ఆ హేరోలు అనుకోరు. కానీ ఆ సినిమాలకు ఓ అర్ధం, పరమార్ధం ఉంటాయి. కేరళ దర్శక నిర్మాతలకు వాళ్ళ ప్రేక్షకులు అంటే గౌరవం ఎక్కువ. థియేటర్ కి వచ్చే వాళ్ళని ఆలోచనన విధానాన్ని సాన పడతారు. నాలుగు పాటలు, నాలుగు పోరాటాలు, నాలుగు వెకిలి హాస్యం సన్నివేశాలు పెడితే ఓ సినిమా అవుతుంది అనుకునే మన దృక్కోణాన్ని మలయాళం చిత్రాలు సమ్మెట పోటుతో ఛిద్రం చేస్తాయి. వ్యక్తిత్వాలను, వ్యక్తుల కోరికలను గౌరవించే ఉద్దేశం ఉంటేనే కాదల్ ద కోర్ చూడండి సమాజానికి, మన కోరికలకు మధ్య యుద్ధం  కనిపిస్తుంది. మనుషులకి, మనసులకి మధ్య ఆరాట, పోరాటాలు కనిపిస్తాయి. ఈ సినిమా ప్రభావం మనమీద చాన్నాళ్లపాటు ఉంటుంది. 

Tags:    

Similar News