అనేక ఏళ్లుగా తెలంగాణకు అనేక అన్యాయాలు జరిగినా ఢిల్లీకి గులాములైన కాంగ్రెస్ నేతలు, చంద్రబాబుకు గులాములైన టీడీపీ నేతలు ప్రశ్నించలేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆరోపించారు. కాంగ్రెస్ నేతలే తెలంగాణకు అసలైన శాపమని పేర్కొన్నారు. గురువారం నల్గొండ జిల్లాలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ...
- నాగార్జున సాగర్ అసలు పేరు నందికొండ ప్రాజెక్టు. ఇప్పుడున్న స్థానం నుంచి 18 కిలోమీటర్ల పైన కట్టాల్సి ఉండే. 180 టీఎంసీలు తెలంగాణకు, 60 టీఎంసీలు ఆంధ్రకు ఇవ్వాలి. కానీ, ఢిల్లీని చూడగానే 1950 నుంచి నేటి వరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు లాగులు తడుస్తాయి. అందుకే పేరు మార్చి, నిర్మాత స్థలం మార్చి తెలంగాణకు అన్యాయం జరిగినా అనాటి కాంగ్రెస్ నేతలు నోరు మెదపలేదు.
- గొల్లకురుమలు, చేనేత కార్మికుల వృత్తులు నాశనం అయితుంటే కాంగ్రెస్, టీడీపీ నేతలు ఏనాడూ పట్టించుకోలేదు.
- పెద్దపెద్ద మాటలు మాట్లాడే చెత్త నాయకులు అంతా నల్గొండ జిల్లాలోనే ఉన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానంటే కాంగ్రెస్ నేతలు పారిపోయారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏ విషయంలోనూ కనీస అవగాహన లేదు.
- దక్షిణ తెలంగాణలో ఒక్క పవర్ ప్లాంటు లేకున్నా ఏనాడు ఇక్కడి కాంగ్రెస్ నేతలు అడగలేదు. జానారెడ్డి అంత లావు లేకున్నా... ఉత్తమ్ కుమార్ రెడ్డి అంత పొడవు లేకున్నా... టీఆర్ఎస్ మంత్రి జగదీశ్ రెడ్డి నాతో కొట్లాడి పవర్ ప్లాంట్ ను తెచ్చుకున్నారు. ఇవాళ 29,945 కోట్ల పెట్టుబడితో మిర్యాలగూడ నియోజకవర్గం దామరచర్లలో 4000 మెగావాట్ల పవర్ ప్లాంటు కడుతున్నాం. మేము కష్టపడి తెస్తే కోర్టుకు పోయి కాంగ్రెస్ నేతలు స్టే తీసుకువచ్చారు.
- మంత్రి పదవి కోసం జానారెడ్డి గతంలో తెలంగాణ కోసం ఓ పార్టీ పెట్టి విజయభాస్కర్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వగానే మూసేశాడు.
- నల్గొండ జిల్లాకు ఎంత అన్యాయం జరిగినా కాంగ్రెస్ నేతలు మంత్రి పదవులు, కాంట్రాక్టులు, పైరవీల కోసం కాంగ్రెస్ నేతలు పాకులాడారు.
- మైనారిటీల కోసం దేశం మొత్తం నాలుగు వేల కోట్ల బడ్జెట్ పెడితే ఒక్క తెలంగాణలోనే తమ ప్రభుత్వం రెండు వేల కోట్ల బడ్జెట్ పెట్టామంటే మైనారిటీలకు తాము ఎంత పెద్దపీట వేస్తున్నామో అర్థం చేసుకోవాలి.
- ఒక్క కాళేశ్వరం ప్రాజెకట్ మీద కాంగ్రెస్ సన్నాసులు 196 కేసులు వేశారు. అన్ని అధిగమించి 24 గంటలు కడుపు, నోరు కట్టుకుని పనిచేసుకుంటున్నాం.
- ఇవాళ తెలంగాణలో గుడుంబా బట్టీలు లేవు, పేకాట క్లబ్బులు లేవు, మట్కా జుదాలు లేవు, గుండాల తండాలు లేవు, సెక్రటేరియట్ లో పైరవీకారుల మందలు లేవు, భూకబ్జాలు లేవు, మత కల్లోలాలు లేవు, బాంబుదాడులు లేవు, భారతదేశమే నివ్వెరపోయేలా శాంతిభద్రతలు నిర్వహిస్తున్నాం. నాలుగున్నరేళ్లలో ఒక్క దగ్గరైనా మతకల్లోలాలు జరిగాయా..? ఇవన్నీ చూసి కాంగ్రెస్ నాయకుల కళ్లు మండుతున్నాయి.
- సిగ్గు లేకుండా, హీనాతిహీనంగా కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయం కోసం నీచాతి నీచంగా చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారు.
- నాలుగేళ్లు నరేంద్ర మోదీతో ఉన్న చంద్రబాబు ఇవాళ సిగ్గులేకుండా నేను నరేంద్ర మోదీతో కలిసానని సిగ్గులేకుండా చెబుతున్నాడు.
- తెలంగాణ దెబ్బేందో ఒకసారి తగిలితే ఎగిరి విజయవాడలో పడ్డాడు. అక్కడ చంద్రబాబుకు సక్కగ లేదు. మేము మూడోకన్ను తెరిస్తే చంద్రబాబు ఏం కావాలో ఆలోచించుకోవాలి. చంద్రబాబు పేరు చెపితే తెలంగాణలో దొడ్డిలో కట్టేసిన బర్రెలు కూడా తాళ్లు తెంపేసుకుని పారిపోతాయి. అటువంటి చంద్రబాబుకు తెలంగాణను మళ్లీ అప్పచెపుదామా ప్రజలు ఆలోచించుకోవాలి.