బాబు ఊహూ అంటే... కేసీఆర్ ఊ అంటున్నారే?

బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరుస్తామని రెండేళ్లలో దేశ ముఖ చిత్రాన్ని మార్చేస్తామని కేసీఆర్ చెప్పారు

Update: 2022-02-02 02:37 GMT

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఏపీ కేంద్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించింది. ప్రధానంగా ప్రాంతీయ పార్టీల అధినేతలు జాతీయ నేతలుగా ఎదగాలని ప్రయత్నించారు. ఎన్టీఆర్ నుంచి కేసీఆర్ వరకూ ఈ ప్రయత్నాలు చేశారు. ఎన్టీఆర్ నేషనల్ ఫ‌్రంట్ పెట్టారు. సక్సెస్ కాలేకపోయారు. అధికారంలో ఇక్కడ ఉంటేనే కొద్దోగొప్పో వీరి మాటలను ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు లెక్క చేస్తారు. లేకుంటే దేకను కూడా దేకరు. దక్షిణాది రాష్ట్రం కావడం, ప్రాంతీయ పార్టీల నేతలు కావడంతో గతంలో వీరు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

చంద్రబాబు ప్రయత్నాలు...
జాతీయ నేతగా చంద్రబాబు ఎదిగేందుకు చాలా ప్రయత్నించారు. ఢిల్లీలో చక్రం తిప్పానని ఆయనంతట ఆయనే ప్రకటించుకున్నారు. ఎన్డీఏ హయాంలో రాష్ట్రపతి నియామకంలోనూ, ఇతర ముఖ్యమైన నిర్ణయాల్లో చంద్రబాబు కీలక భూమిక పోషించారు. కానీ ఎన్నికల అనంతరం చంద్రబాబును ఉత్తరాది పార్టీలు పక్కన పెట్టేశాయి. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయకత్వాన్ని అంగకరించిన ఉత్తరాది పార్టీలు ఆయన ఓటమి పాలవ్వగానే పక్కన పెట్టేశాయి.
ఇప్పుడు ఏపీకే...
ఇక 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు జాతీయ రాజకీయాలను పూర్తిగా వదిలేశారు. 2019 ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలని చంద్రబాబు ప్రయత్నించారు. తన పార్టీకి ఆగర్భ శత్రువైన కాంగ్రెస్ తో చేతులు కలిపారు. అయినా బీజేపీ విజయాన్ని ఆపలేకపోయారు. ఇప్పుడు చంద్రబాబు ఏపీ వరకే పరిమితమయ్యారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు.
కేసీఆర్ ఈసారి....
బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరుస్తామని, రెండేళ్లలో దేశం ముఖ చిత్రాన్ని మార్చేస్తామని చెప్పారు. కేసీఆర్ కొన్ని ఏళ్లుగా ఫెడరల్ ఫ్రంట్ పెడతామని చెబుతున్నారు. ఎన్నికలు దగ్గర పడిన ప్రతిసారీ కేసీఆర్ ఇలా చెప్పడం మామూలేనని బీజేపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. అయితే ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ పై కేసీఆర్ ఒంటికాలిపై లేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ముంబయికి వెళ్లి ఉద్ధవ్ థాక్రేను కలుస్తామని చెప్పారు. కానీ గతంలో ఎన్టీఆర్ నుంచి నేడు కేసీఆర్ వరకూ జాతీయ రాజకీయాల్లో నిలదొక్కుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరి కేసీఆర్ కూడా అంతేనా? లేక అద్భుతమేదైనా సృష్టిస్తారా? అన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News