కాంగ్రెస్ లోకి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీలో చేరిన అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఎనిమిది పర్యాయాలు మా తండ్రి, నేను ఎమ్మెల్యేలుగా పనిచేశాం. ఈ గుర్తింపు, అవకాశం మాకు కాంగ్రెస్ పార్టీ వల్లనే వచ్చింది. అనేక పదవులు మేము చేపట్టాం అంటే కాంగ్రెస్ పార్టీనే కారణం. గాంధీ కుటుంబానికి అనేక ఏళ్లుగా దగ్గరగా పనిచేశాము. శాయశక్తులా కష్టపడి కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలో తీసుకువచ్చేందుకు కృషి చేస్తాను. కాంగ్రెస్ పార్టీ తనకు ఏ పని ఇచ్చినా చేసేందుకు సిద్దంగా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు, ఇతర పదవుల్లో పనిచేసిన 35-40 మందితో మాట్లాడుతున్నాం. వారు కూడా కాంగ్రెస్ లోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. మా తమ్ముడు టీడీపీలో చేరడాన్ని నేను వ్యతిరేకించాను. అది అతని వ్యక్తిగత నిర్ణయం.’’ అని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ తోనే రెండు రాష్ట్రాలకు మేలు
విభజన హామీలపై కిరణ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ...‘‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఏపీకి ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, పోలవరం, 11 యూనివర్సిటీలు, రైల్వే జోన్, రెండు రాష్ట్రాల్లో ఎయిమ్స్, ఉక్కు కర్మాగారాలు వంటి హామీలు నాలుగేళ్లుగా నెరవేరలేదు. విభజన హామీలు అమలు చేయడంలో బీజేపీ విఫలమైంది. ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుంది. ఆ హామీలు నెరవేర్చితేనే ప్రజలకు పార్లమెంటుపై విశ్వాసం ఉంటుంది. తెలుగు ప్రజలకు, రెండు రాష్ట్రాలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి’’ అని ఆయన పేర్కొన్నారు.