మెక్ డొనాల్డ్స్ కూల్ డ్రింక్ లో బల్లి.. వీడియో వైరల్

ఇద్దరు వ్యక్తులు మెక్‌డొనాల్డ్స్‌లో కోక్ తాగుతుండగా, వారి డ్రింక్‌లో బల్లి కనిపించింది. కస్టమర్లలో ఒకరైన..

Update: 2022-05-25 06:56 GMT

కూల్ డ్రింక్‌లో చనిపోయిన బల్లి కనిపించడంతో అహ్మదాబాద్‌లోని సైన్స్ సిటీ రోడ్‌లోని మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌ను అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (AMC) సీల్ చేసింది. ఇద్దరు వ్యక్తులు మెక్‌డొనాల్డ్స్‌లో కోక్ తాగుతుండగా, వారి డ్రింక్‌లో బల్లి కనిపించింది. కస్టమర్లలో ఒకరైన భార్గవ జోషి దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దాని గురించి మెక్‌డొనాల్డ్ మేనేజర్‌కు ఫిర్యాదు చేశారని, అయితే అతను పెద్దగా పట్టించుకోలేదని విమర్శించారు. డ్రింక్ కొన్నారు కదా.. అందుకు చెల్లించిన డబ్బు మాత్రమే తిరిగి ఇవ్వబడుతుందని మేనేజర్ చెప్పినట్లుగా కస్టమర్ ఆరోపించాడు. ఆ వీడియో వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చర్యలకు దిగింది. ఆ రెస్టారెంట్ ను తనిఖీ చేసిన తర్వాత, వారు అవుట్‌లెట్‌కు సీలు వేశారు. కూల్ డ్రింక్ శాంపిల్ తీసుకుని పబ్లిక్ హెల్త్ లేబొరేటరీకి పంపించారు.

భార్గవ్ జోషి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న AMC ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ దేవాంగ్ పటేల్ అహ్మదాబాద్‌లోని పబ్లిక్ హెల్త్ లాబొరేటరీలో పరీక్ష కోసం అవుట్‌లెట్ నుండి కూల్ డ్రింక్స్ నమూనాలను సేకరించారు. ప్రజారోగ్య భద్రత కోసం రెస్టారెంట్‌ను మూసివేశారు. ముందస్తు అనుమతి లేకుండా అవుట్‌లెట్ ప్రాంగణాన్ని తిరిగి తెరవడానికి అనుమతి లేదని AMC ఆదేశించింది.
మెక్ డొనాల్డ్స్ సంస్థ ఈ ఘటనకు సంబంధించి పత్రికా ప్రకటన విడుదల చేసింది. "మెక్‌డొనాల్డ్స్‌లో, మా కస్టమర్‌లందరి భద్రత, పరిశుభ్రత కోసం మేము కట్టుబడి ఉన్నాము. నాణ్యత, సేవ, శుభ్రత.. మా వ్యాపార కార్యకలాపాలలో ప్రధానమైనవి. మా గోల్డెన్ గ్యారెంటీ ప్రోగ్రామ్‌లో భాగంగా, మేము మా అన్ని మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్‌లలో 42 కఠినమైన భద్రత, పరిశుభ్రత ప్రోటోకాల్‌లను అమలు చేస్తున్నాము. వంటగది, రెస్టారెంట్‌లను శుభ్రపరచడం, శానిటైజేషన్ కోసం కఠినమైన ప్రక్రియలు ఉన్నాయి. అహ్మదాబాద్‌లోని అవుట్‌లెట్‌లో జరిగిన ఈ ఘటనపై విచారణ జరుపుతున్నాం. మేము పదేపదే తనిఖీ చేసినప్పటికీ, తప్పు ఏదీ కనుగొనబడలేదు, మేము అధికారులకు సహకరిస్తున్నాము." అని చెప్పుకొచ్చారు.


Tags:    

Similar News