మేడారంలో ఆవిష్కృతమైన అపురూప ఘట్టం.. గద్దెపైకి చేరిన సమ్మక్క
అమ్మవారి ఆగమనం సమయంలో కోరుకున్న కోరికలు తప్పకుండా తీరుతాయన్నది భక్తుల నమ్మిక. తల్లి రాకకు గౌరవ సూచకంగా జిల్లా..
దక్షిణాది కుంభమేళాగా పిలువబడే.. ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర.. మేడారం మహాజాతరలో రెండోరోజు మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. 20 ఏళ్లలో తొలిసారిగా మాఘశుద్ధ పౌర్ణమి రోజు మహాజాతర ప్రారంభం కావడంతో భక్తులు.. భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రాకతో మేడారం భక్తజనసంద్రంగా మారింది. మహాజాతరలో తొలిరోజు.. సారలమ్మ, తండ్రి పగిడి గద్దరాజు, భర్త గోవిందరాజు లు గద్దెలపై ఆసీనులై భక్తులకు దర్శనమిస్తున్నారు. రెండో సమ్మక్కను గద్దెపై కొలువు దీర్చారు గిరిజన పూజారులు.
సమ్మక్క ఆగమనాన్ని చూసేందుకు.. ఉదయం నుంచే భక్తులు భారీ సంఖ్యలో మేడారంకు చేరుకున్నారు. చిలుకలగుట్టపై ఉన్న సమ్మక్క కుంకుమ భరిణె రూపంలో వచ్చి గద్దెపై కొలువుదీరింది. శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లు, మేళతాళాలు, ప్రభుత్వ లాంఛనాలతో.. పటిష్ఠ బందోబస్తు మధ్య సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి గద్దెపైకి తీసుకువచ్చారు. ఆ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున పోటెత్తుతారు.
అమ్మవారి ఆగమనం సమయంలో కోరుకున్న కోరికలు తప్పకుండా తీరుతాయన్నది భక్తుల నమ్మిక. తల్లి రాకకు గౌరవ సూచకంగా జిల్లా పోలీసు అధికారి గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి.. అమ్మకు గౌరవ వందనం సమర్పిస్తారు. సమ్మక్క కుంకుమ భరిణె రూపంలో మాఘశుద్ధపౌర్ణమి బుధవారం రోజున అమ్మవారిగా అవతరించింది. ఇప్పుడే అదే రోజున, అదే తిథిలో జాతర ప్రారంభమవ్వడం చాలా అరుదుగా జరిగే విషయమని సమ్మక్క ఆలయ పూజరి కొక్కెర రమేశ్ తెలిపారు.