Weather Report : మరో రెండు రోజులు వర్షాలు... వడగండ్లతో కూడిన వానలు పడే ఛాన్స్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది;

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం లో విస్తరించిన ద్రోణి క్రమంగా విస్తరిస్తుందని, ఉపరితల ఆవర్తనం బలహీన పడిందని తెలిపింది. ఏపీలో నైరుతి దిశగా బలమైన గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో రానున్న రెండు రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని కూడా చెప్పింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని హెచ్చరించింది.
ఈదురుగాలులతో కూడిన...
ఈదురుగాలులు గంటకు నలభై నుంచి యాభై కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు తేలికపాటి వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని చెప్పింది. అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశముందని చెప్పింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశమున్నందున పశువుల కాపర్లు, రైతులు చెట్ల కింద ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రాయలసీమలోనూ అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. పగలు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, సాయంత్రానికి జల్లులు పడతాయని తెలిపింది.
తీవ్ర వడగాలులు...
రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రత పెరుగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోని ముప్ఫయి మండలాల్లో తీవ్ర వడగాలులు, 67 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. నిన్న పల్నాడు జిల్లా రావిపాడులో 43.7 డిగ్రీల గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయినట్లు అధికారులు తెలిపారు. 119 ప్రాంతాల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు కు పైగా నమోదు అయినట్లు ఏపీ విపత్తు నిర్వహణల సంస్థ తెలిపింది. శనివారం 14 మండలాల్లో తీవ్ర, 68 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని కూడా చెప్పింది. ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఏపీవిపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ కోరారు.
రాగల రెండు రోజుల్లో...
తెలంగాణలోనూ రాగల రెండు రోజుల్లో అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని చెప్పింది. అయితే తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ముఖ్యంగా మహబూబాబాద్, సూర్యాపేట్, నల్లగొండ, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్వ, వరంగల్ , నాగర్ కర్నూల్, నారాయణ పేట్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని, ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.