Weather Report : ఇదేమి వింతరా నాయనా.. ఎండ.. వర్షంతో ఇంకా ఎన్నాళ్లు?
ఆంధ్రప్రదేశ్ లో నేడు కూడా వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.;

ఆంధ్రప్రదేశ్ లో నేడు కూడా వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే అదే సమయంలో ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతుంది. రాజస్థాన్ నుంచి కోస్తాంధ్ర వరకూ ఉపరితల ద్రోణి విస్తరించడంతో ఈరోజు కూడా కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే తేలికపాటి వర్షాలు పడతాయని, అదే సమయంలో ఈదురుగాలులు బలంగా వీస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశముందని, రైతులు జాగ్రత్తగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
అత్యధిక ఉష్ణోగ్రతలు...
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. తీవ్రమైన వడగాలులు కూడా వీస్తున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. ఐదు గంటల తర్వాత వర్షం పడుతుంది. ఇది నిజంగా భిన్నమైన వాతావరణంగానే చెప్పాలి. ఉష్ణోగ్రతలు కూడా 43 డిగ్రీలకు చేరుకున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. పగలు ఎండ, రాత్రి వర్షం తో విభిన్న మైన వాతావరణం నేడు కూడా ఆంధ్రప్రదేశ్ లో కొనసాగనుంది.
రెండు డిగ్రీలు అదనంగా...
తెలంగాణలోనూ ఇదే పరిస్థితి దాదాపు కొనసాగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి వర్షాలు కురుస్తాయని, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఈశాన్య మధ్యప్రదేశ్ ప్రాంతం నుంచి ఈశాన్య తెలంగాణ వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడిన కారణంగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కానీ ఇదే సమయంలో తెలంగాణలోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా చెప్పింది. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులుతెలిపారు.
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్...
సాధారణ ఉష్ణోగ్రతలు కంటే అదనంగా మరో రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణలో నేడు రెండు నుంచి మూడు డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. దీంతో వాతావరణ శాఖ ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, భద్రాద్రి, జగిత్యాల, నిజామాబాద్‌కు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. తెలంగాణ తూర్పు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.