ఆ ఎమ్మెల్యేలకు నిరాశ.. ప్రభుత్వం పై అలక !
తమకు మంత్రి పదవి వస్తుందని గంపెడాశలతో ఎదురు చూసిన పలువురు ఎమ్మెల్యేలకు తీవ్ర నిరాశే ఎదురైంది. పాత మంత్రివర్గంలో ఒకరైన..
తాడేపల్లి : ఏపీ కొత్త మంత్రి వర్గం తుది జాబితా విడుదలైంది. 10 మంది కొత్తవారికి 15 మంది పాతవారికిి కొత్త కేబినెట్ లో చోటు కల్పించారు సీఎం జగన్. కానీ.. తమకు మంత్రి పదవి వస్తుందని గంపెడాశలతో ఎదురు చూసిన పలువురు ఎమ్మెల్యేలకు తీవ్ర నిరాశే ఎదురైంది. పాత మంత్రివర్గంలో ఒకరైన బాలినేనికి కొత్త మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. దాంతో ఆయన ప్రభుత్వంపై అలకబూనినట్లు తెలుస్తోంది. బాలినేనిని బుజ్జగించేందుకు వైసీపీ శ్రేణులు ఆయన నివాసానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి, సామినేని ఉదయభాను బాలినేని నివాసానికి వెళ్లి.. ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
మంత్రి పదవి ఆశించిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణకు నిరాశ ఎదురైంది. సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం సెక్రటరీ ధనుంజయరెడ్డి పిన్నెల్లికి ఫోన్ చేసి.. సముదాయించేందుకు ప్రయత్నించగా.. మీరు, ప్రభుత్వం చూపిన అభిమానానికి థాంక్స్ అంటూ కాల్ కట్ చేశారు. ఆపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు. పిన్నెల్లికి మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంతో.. ఆయన అనుచరులు వైసీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
అలాగే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కూడా నిరాశ తప్పలేదు. మంత్రి పదవి వస్తుందని ఆశించిన శ్రీధర్ రెడ్డి.. తనను పక్కన పెట్టడం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదట్నుంచి తనకు పార్టీలో ప్రాధాన్యతలేదని తీవ్ర అసహనంతో క్యాంప్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. మంత్రివర్గంలో తనకు స్థానం దక్కలేదని సన్నిహితులకు తెలిపారు. మంత్రి పదవి రాకపోవడంతో రేపట్నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరగాల్సిన గడపగడపకు ఎమ్మెల్యే కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు సమాచారం.