అద్వాణీపై మోడీ ఆలోచన ఇదే...

Update: 2018-06-05 13:30 GMT

రానున్న ఎన్నికల్లో గెలుపుపై నరేంద్ర మోడీ, అమిత్ షాలకు భయం పట్టుకుందా..? అంటే, తాజా పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది. ఉప ఎన్నికల్లో భారీ ఎదురుదెబ్బలు, టీడీపీ వంటి మిత్రపక్షాలు తెగదెంపులు చేసుకోవడం, శివసేన, జేడీయూ కూడా రేపోమాపో టాటా చేప్పేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో రానున్న ఎన్నికల గురించి బీజేపీ పెద్దలకు బెంగ ఉన్నట్లు తెలిస్తోంది. దీనికి తోడు ప్రాంతీయ పార్టీలు, విపక్షాలన్నీ ఒక్కతాటి పైకి చేరుతుండటంతో వారు మరో ఏడాదిలో జరుగనున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే ప్లాన్లు వేస్తున్నారు.

నాలుగేళ్లుగా పట్టించుకోకుండా...

వాస్తవానికి బీజేపీలో వయస్సుమీరిన వారికి టిక్కెట్లు ఇవ్వద్దని పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఓ కొత్త నిబంధన తీసుకువచ్చారు. ఇందులో భాగంగానే మంత్రివర్గ విస్తరణ సమయంలో కూడా కొందరిని తప్పించారు. ఇక బీజేపీ కురువృద్ధులు, అనేక ఏళ్లుగా పార్టీని భూజాలపై మోసుకుని నడిపించిన అద్వాణీ, మురళీ మనోహర్ జోషీ వంటి వారికి కూడా పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇక మోడీ-షా పార్టీలోని సీనియర్లకు లెక్కచెయడం లేదని, గౌరవించడం లేదనే ఆరోపణలు కూడా తరచూ వస్తూనే ఉన్నాయి. అయితే, గతంలో అమిత్ షా పార్టీ అధ్యక్షుడయ్యాక పార్టీ నిర్ణయాల కోసం మార్గదర్శ మండలి పేరుతో ఓ ఐదుగురు సభ్యుల కమిటీ వేశారు. ఇందులో మోడీ, షా , కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ తో పాటు అద్వాణీ, మురళీ మనోహర్ జోషీ కూడా ఉన్నారు. అయితే, ఈ కమిటీ ఒక్కసారి కూడా సమావేశం కాకపోవడం గమనార్హం.

విజయం ముఖ్యం...వయో పరిమితి కాదు...

ఇక మరో ఏడాదిలో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో అద్వాణీని మళ్లీ ఉపయోగించుకోవాలని మోడీ-షా ఆలోచిస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి 90 ఏళ్ల అద్వాణీని కొత్త నిబంధన ప్రకారం ఈ ఎన్నికల్లో పక్కన పెడతారని అంతా భావించారు. గత నాలుగేళ్లుగా మోడీ-షాల వ్యవహారశైలి కూడా అలానే ఉంది. అయితే, ఇప్పుడు సడెన్ గా వీరిద్దరూ మనస్సు మార్చుకున్నారని వార్తలు వస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో అద్వాణీతో పాటు మురళీ మనోహర్ జోషీని కూడా బరిలోకి దింపాలని భావిస్తున్నారట. అయితే, కొత్తగా బీజేపీ పెట్టుకున్న వయోపరిమితి నిబంధన ప్రకారం వీరిద్దరూ పోటీకి దూరంగా ఉండాలి. కానీ, మినహాయింపును ఇచ్చి మరీ పోటీ చేయించాలని ఆలోచిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల మోడీ-షా ఇద్దరు కలిసి అద్వాణీని కలిసి చర్చించినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో ప్రతీ సీటు కీలకమై అయినందున వీరి పోటీ కలిసివస్తుందని, మరోవైపు పెద్దలను గౌరవించట్లేదనే ఆరోపణలను కూడా తిప్పికొట్టవచ్చనేదే దీని వెనుక ముఖ్య ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లోనూ విజయం కోసం ఈ వయోపరిమితి నిబంధన నుంచి యడ్యూరప్పకు మినహాయింపు ఇచ్చి పోటీ చేయించిన విషయం తెలిసిందే.

Similar News