అవునంటే కాదనిలే... కాదంటే అవుననిలే ...!

Update: 2018-10-07 18:29 GMT

అవునంటే కాదనిలే ... కాదంటే అవునని లే ఆడవారి మాటలకు అర్ధాలు వేరని ఒక సినీ కవి రాసిన మాటలు రాజకీయాలకు వర్తిస్తాయి. రాజకీయాల్లో అబ్బే..... లేదు మేం అలా చేయడం లేదంటే ఏదో వున్నట్లే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జాతీయ స్థాయిలో బిజెపి తో తెగతెంపులు చేసుకున్న టిడిపి కి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమే అంటున్నారు అంతా. ప్రస్తుత దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ లేని మూడో కూటమికి సీన్ లేదని లెక్కలు వేస్తున్నారు. ఇటీవలే కాంగ్రెస్, బిజెపి లేని కూటమికి కెసిఆర్ ప్రయత్నం చేసి విఫలం అయిన నేపధ్యాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు.

సుజనా చౌదరి ప్రకటనలో అర్ధం అదేనా ...?

తాము జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో జట్టు కట్టబోవటం లేదని తాజాగా టిడిపి ప్రకటించింది. తెలంగాణాలో రెండు పార్టీలకు అవసరం అయిన జట్టు కట్టిన నేపథ్యంలో ఏపీలో కూడా వీరిద్దరి పొత్తు అనివార్యం అంటున్నారు అంతా. అసలు ఏపీలో వైసిపి జోరును కాంగ్రెస్ తో జత కట్టి అడ్డుకోవచ్చన్న టిడిపి వ్యూహంలో భాగంగానే తెలంగాణాలో ముందస్తుగా ఆ పార్టీ కి స్నేహ హస్తాన్ని సైకిల్ అందించిందన్నది టాక్.

వ్యూహాత్మకంగా.....

అందుకే ఇప్పటినుంచి వ్యూహాత్మక అడుగులను ఆచితూచి వేస్తుంది టిడిపి. కాంగ్రెస్ తో పొత్తు అంశం అవసరం వున్నా లేకపోయినా ప్రస్తావిస్తూ మానసికంగా క్యాడర్ ను అన్ని రకాలుగా సిద్ధం చేసే ఎత్తుగడల్లో టిడిపి ఉందంటున్నారు. అందుకే మాజీ కేంద్రమంత్రి టిడిపి నేత సుజనా చౌదరి వ్యాఖ్యలు చంద్రబాబు కాంగ్రెస్ ప్రేమలో పడటం ఖాయమన్న సంకేతాలు బలంగా పంపుతున్నాయి. అయితే చంద్రబాబు మాత్రం టీడీపీ వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఒంటరిగా పోటీ చేస్తామనే లీకులు ఇస్తున్నారు. మరి ఈ లీకుల అర్థం ఏందో చూడాల్సి ఉంది.

Similar News