శ్రీ పీఠం అధిపతి, రాష్ట్రీయ హిందూ సేన అధ్యక్షులు పరిపూర్ణంనంద స్వామి రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరి తెలంగాణ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతోంది. అంతేకాదు, ఆయనే తెలంగాణ బీజేపికి ముఖ్యమంత్రి అభ్యర్థి అని కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ఢిల్లీలో కలిసి రాజకీయాలపై చర్చించారు. అనంతరం బీజేపీ నేత రామ్ మాధవ్ తోనూ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. తెలంగాణలో ఈసారి సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ పరిపూర్ణానంద ను పార్టీలోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే, ఆయన పార్టీలో నేరుగా చేరతారా..? లేదా ప్రచారం చేస్తారా.? అనేది ఇంకా తేలలేదు. 10వ తేదీ అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తుండటంతో ఈ విషయంపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.