దూతగా డిగ్గీరాజా
తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న అంతర్గత సంక్షోభాన్ని నివారించేందుకు పార్టీ హైకమాండ్ సిద్ధమయింది.
తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న అంతర్గత సంక్షోభాన్ని నివారించేందుకు పార్టీ హైకమాండ్ సిద్ధమయింది. ఇక్కడి సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకంగా పరిశీలకులను పంపనున్నట్లు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ను పరిశీలకుడిగా పంపే అవకాశముందని చెబుతున్నారు. దిగ్విజయ్ సింగ్ గతంలోనూ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. అందరితోనూ సన్నిహిత సంబంధాలున్నాయి.
పరిశీలకుడిగా...
దిగ్విజయ్ సింగ్ అయితే కాంగ్రెస్ లో నెలకొన్న ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరిస్తారని అధిష్టానం భావిస్తుంది. ఈరోజు సాయంత్రం, రేపు ఉదయం కానీ దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ కు వచ్చే అవకాశాలున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సీనియర్ నేతలంతా సమావేశమై అసంతృప్తి గళం విప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ పరిశీలకులను ఇక్కడకు పంపాలని నిర్ణయించింది. ఈరోజు తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేతలు మరోసారి సమావేశమవుతున్నారు.
సమస్య పరిష్కారానికి...
ఈ నేపథ్యంలోనే దిగ్విజయ్ ను హైదరాబాద్ పంపాలని నిర్ణయించినట్లుంది. ఇదిలా ఉండగా పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ హుటాహుటిన రాజస్థాన్ బయలుదేరి వెళ్లారు. రాజస్థాన్ లో భారత్ జోడో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీని ఆయన కలసి పరిస్థితిని వివరించనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న సంక్షోభాన్ని సత్వరమే పరిష‌్కరించేందుకు మాత్రం హైకమాండ్ పూర్తిగా సిద్ధమయింది. బేధాభిప్రాయాలు లేకుండా సమస్యను పరిష్కరించాలని భావిస్తున్నారు. సీనియర్ నేతలు ఢిల్లీకి వెళ్లకముందే సమస్యను పరిష్కారించాలని పార్టీ హైకమాండ్ భావిస్తుంది.