లోన్ కోసం ఏకంగా గ్రామాన్నే తాకట్టు పెట్టేశారు.. ఎక్కడో చూడండి
గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు డబ్బుపై వ్యామోహం బాగా పెరిగిపోయింది. కష్టపడి పనిచేసే మనషులు కాదు. అడ్డదారిలో డబ్బులు
లోన్ కావాలంటే ఎవరైనా బంగారమో, ఆస్తిపత్రాలో తాకట్టుపెడతారు. కానీ కొందరు ప్రబుద్ధులు ఏకంగా గ్రామాన్నే తాకట్టు పెట్టేశారు. ఎక్కడో కాదు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలోనే జరిగిందీ ఘటన. గ్రామాన్ని తాకట్టుపెట్టి లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారు. వాటితో జల్సాలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని పుల్లలచెరువు మండలం సిద్దనపాలెం గ్రామం 296 సర్వే నంబర్ లో ఉంది. ఆ గ్రామ విస్తీర్ణం 8.32 ఎకరాలు. అందులోనే గ్రామస్తులు ఇళ్లు నిర్మించుకుని శతాబ్దాలుగా ఉంటున్నారు.
గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు డబ్బుపై వ్యామోహం బాగా పెరిగిపోయింది. కష్టపడి పనిచేసే మనషులు కాదు. అడ్డదారిలో డబ్బులు ఎలా సంపాదించాలా అని ఆలోచించారు. అంతే.. గ్రామాన్నే తాకట్టు పెట్టాలని స్కెచ్ వేశారు. పుల్లల చెరువు రెవెన్యూ కార్యాలయంలో తమ పలుకుబడిని ఉపయోగించారు. గడ్డం సుబ్బయ్య, కొల్లి వీర బ్రహ్మయ్య అనే ఇద్దరు వ్యక్తులు 2020లో 8.32 ఎకరాల భూమిని తమ పేరుపైకి మార్పించుకున్నారు. 296లోని భూమినంతా తమ పేరుపైకి మార్చి పట్టాదారు పాసుపుస్తకాలు కూడా తీసుకున్నారు. అంతటితో ఆగకుండా.. ఆ భూమి పట్టా పుస్తకాలు తాకట్టుపెట్టి లోన్ తీసుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడవు అమలు చేశారు.
2020 జూన్ 26న యర్రగొండపాలెం ముత్తుకలోని డీసీసీబీ బ్యాంకును ఆశ్రయించి లోన్ కావాలని కోరారు. బ్యాంకు అధికారులు పాస్ పుస్తకాలను గమనించకుండానే ఆన్‌లైన్ రికార్డులు పరిశీలించి మూడు నెలల తర్వాత అంటే 2020 సెప్టెంబర్ 23న రూ.9 లక్షల లోన్ మంజూరు చేశారు. ఆ లోన్ డబ్బునంతా కేటుగాళ్లు జేబులో నింపుకుని జల్సాలు చేస్తున్నారు. కొద్దిరోజులకు ఈ విషయం ఆ నోటా ఈ నోటా చేరి.. చివరికి గ్రామస్తులకు తెలిసింది. దీంతో బ్యాంకు, రెవెన్యూ అధికారులను నిలదీశారు గ్రామస్తులు. స్థానిక తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామ భూములను అక్రమంగా పట్టా చేయించుకున్న నిందితులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామాన్ని తాకట్టు పెట్టిన అంశంపై ప్రశ్నించగా అది తన హయాంలో జరగలేదన్నారు తహసీల్దార్ దాసు. గత తహశీల్దార్ అశోక్ రెడ్డికే ఈ విషయాలన్నీ తెలుసని, వెంటనే విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.