ఆళ్లగడ్డ పంచాయతీని మించి ప్రొద్దుటూరు....!

Update: 2018-10-06 03:25 GMT

అమరావతిలో నేడు ప్రొద్దుటూరు పంచాయతీ జరగనుంది. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. సీఎం రమేష్ వర్గానికి చెందిన ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి చెందిన 21 మంది కౌన్సిలర్లు ఇటీవల రాజీనామాలు చేశారు. వారి రాజీనామాలు ఇంకా ఆమోదం పొందలేదు. వరదరాజులు రెడ్డి నిరంకుశ ధోరణికి నిరసనగానే తాము రాజీనామా చేసినట్లు కౌన్సిలర్లు చెబుతున్నారు.

తగ్గని వరదరాజులు రెడ్డి.....

మరోవైపు వరదరాజులు రెడ్డి కూడా ఏమాత్రం తగ్గడం లేదు. సీఎం రమేష్ ప్రొద్దుటూరు రాజకీయాల్లోకి అడుగుపెట్టనివ్వబోనని గట్టిగా సమాధానమిచ్చారు. గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్న సీఎం రమేష్ తో తాడో పేడో తేల్చుకుంటానని వరదరాజులు రెడ్డి బహిరంగంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వరదరాజులు రెడ్డి అమరావతికి బయలుదేరి వచ్చారు. వీరితో పాటు 21 మంది కౌన్సిలర్లు అమరావతి చేరుకున్నారు. ఇప్పటికే సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి అమరావతిలోనే ఉన్నారు.

తొలుత కళా వద్ద పంచాయతీ.....

తొలుత రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కళావెంకట్రావుతో వీరు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ కౌన్సిలర్లు తామెందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో వారు వివరించనున్నారు. అలాగే వరదరాజులు రెడ్డి సయితం సీఎం రమేష్ ప్రొద్దుటూరు రాజకీయాల్లో జోక్యం చేసుకోవడాన్ని అధిష్టానాన్ని నిలదీయనున్నారు. కళా వెంకట్రావు దగ్గర ఈ పంచాయతీ తెగకుంటే ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రొద్దుటూరు నేతలతో సమావేశమయ్యే అవకాశముంది.

Similar News