జీవీఎల్ కలలు ... అడ్డంకి ఎవరంటే?

రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయన ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు

Update: 2022-09-08 08:54 GMT

రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయన ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో ఏడాదిలో ఆయన పదవీ కాలం త్వరలోనే కానుంది. మరోసారి బీజేపీ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యే అవకాశాలు లేవు. ఏపీ బీజేపీ గురించి పెద్దగా అధినాయకత్వం పట్టించుకోవడం లేదు. అసలు పదవులు అంటేనే ఏపీ బీజేపీ గుర్తుకు రావడం లేదు. రాజ్యసభ పదవి ఏపీకి మరోసారి కేటాయిస్తారనుకోవడం భ్రమే అవుతుంది. అది ఆయనకు కూడా తెలియంది కాదు.

అధినాయకత్వం....
ఇప్పటి వరకూ అనేక పదవులు భర్తీ చేసినా ఏపీ బీజేపీ నాయకులను పక్కన పెట్టేసింది. కంభంపాటి హరిబాబుకు గవర్నర్ పదవి ఇవ్వడం తప్ప ఏపీలో ఏ నేతకు ఈ మూడేళ్ల కాలంలో పదవి ఇచ్చిన దాఖలాలు లేవు. కేంద్ర మంత్రివర్గంలోనూ ఏపీకి ప్రాతినిధ్యం లేదు. పొరుగున ఉన్న తెలంగాణకు అన్ని పదవులు వెళ్లిపోతున్నాయి. అక్కడ పార్టీ బలోపేతం అవుతుండటంతో కేంద్ర నాయకత్వంపై తెలంగాణపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఏపీలో సీనియర్ నేతలను అసలు పట్టించుకోవడం లేదు. వచ్చే రెండేళ్లు కూడా ఇక్కడి నేతలకు పదవులు దక్కుతాయన్న ఆశలు లేవు.
వచ్చే ఎన్నికలలో
దీంతో జీవీఎల్ నరసింహారావు వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని భావిస్తున్నట్లే కనపడుతుంది. అందుకే ఆయన గత కొద్ది రోజులుగా విశాఖపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఢిల్లీ టు విశాఖ కు తిరుగుతున్నారు. అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. విశాఖలో జీవీఎల్ నరసింహారావు క్యాంప్ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. ఎక్కువ సమయం అక్కడే ఉండి పార్టీ క్యాడర్ ను మంచి చేసుకుంటున్నారు. వారితో తరచూ సమావేశమవుతున్నారు. విశాఖ కేంద్రంగానే ఆయన రాజకీయాలు ప్రారంభించినట్లు కాస్త పరికించి చూసిన వారికెవరికైనా అర్థమవుతుంది.
పురంద్రీశ్వరి ఓకే చెబితేనే....
విశాఖ పార్లమెంటు సీటు గెలుచుకోవడం సులువు. అతి పెద్ద నగరం, కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు ఉండటంతో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు అక్కడ నివాసముంటున్నారు. మోదీ ప్రభుత్వం పట్ల అనుకూలంగా ఇతర రాష్ట్రాల ప్రజలు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గతంలో అనేక సార్లు బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. కులాలు, మతాలకు సంబంధం లేకుండా ఇక్కడ విజయం ఉంటుంది. కొద్దిగా కష్టపడితే ఇక్కడ విజయం సాధించడం సులువవుతుంది. అయితే పురంద్రీశ్వరి ఈ సీటుకు పోటీ పడతారంటున్నారు. ఆమెను విజయవాడకు షిఫ్ట్ చేస్తే తాను విశాఖలో పోటీ చేయవచ్చన్నది జీవీఎల్ నరసింహారావు ఆలోచనగా ఉంది. అందుకే ఇటీవల ప్రధాని మోదీని కలిసి విశాఖలో వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు రావాలని ఆయన ఆహ్వానించారని తెలుస్తోంది. మొత్తం మీద జీవీఎల్ కలలు తీరాలంటే ముందు చిన్నమ్మ విజయవాడలో పోటీ చేసేందుకు అంగీకరించాలి. లేకుంటే ఆయన కలలు ఉప్పు సముద్రం పాలు కాక తప్పదు.
Tags:    

Similar News