కేసీఆర్ ఆలోచన అదేనన్న రేవంత్ రెడ్డి..!

Update: 2018-10-06 06:56 GMT

కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజల్లో ఆదరణ ఉన్నందున టీఆర్ఎస్ గెలవదనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ కొత్త ప్రచారానికి తెరలేపారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పట్ల ప్రజలు సానుకూలంగా ఉండటాన్ని గ్రహించిన కేసీఆర్ ఈ ఎన్నికల్లో పోటీ కేసీఆర్ కు, చంద్రబాబు నాయుడుకు మధ్య అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబుతో తెలంగాణకు సంబంధం లేదని, కానీ టీడీపీ పుట్టిందే హైదరాబాద్ లో అన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. కేసీఆర్ ను గద్దె దించేందుకు కాంగ్రెస్ పార్టీకి సీపీఐ, టీజేఎస్ తో పాటు తెలంగాణ టీడీపీ మద్దతు ఇస్తుందన్నారు. కానీ, ఓటమి భయంతోనే సంబంధం లేని వ్యక్తి అయిన చంద్రబాబు ను తెలంగాణ ఎన్నికల్లోకి కేసీఆర్ పదే పదే తీసుకువస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం పోరాడిన వారిలో కేవలం తమకు అనుకూలంగా ఉన్నవారిపైన మాత్రమే కేసులు తొలగించారని, కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్న ఉద్యమకారులపై కేసులు అలానే ఉన్నాయన్నారు. ఉద్యమంలో నమోదైన 260 రైల్వే కేసుల్లో 10 మాత్రమే తొలగించారని, అవి కూడా కేసీఆర్ కుటుంబసభ్యులపైన ఉన్నవే అన్నారు. మరి, మిగతా కేసుల్లో ఉన్నవారు ఉద్యమకారులు కాదా అని ప్రశ్నించారు.

మీడియాని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..!

కేసీఆర్ పై కుటుంబపాలన, బంధుప్రీతి, కులపిచ్చి అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించే కాంగ్రెస్ ముఖ్య నేత రేవంత్ రెడ్డి కేసీఆర్ మీడియాను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ఇవాళ మీడియాతో మాట్లాడుతూ... తనపై ఐటీ అధికారుల విచారణ సమయంలో టీన్యూస్, నమస్తే తెలంగాణ, టీవీ9 సంస్థలు తీవ్ర దుష్ప్రచారం చేశాయని ఆయన ఆరోపించారు. మలేషియా వంటి దేశాల్లో అకౌంట్లు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేసి ఆధారాలు చూపలేకపోయాయని పేర్కొన్నారు. టీవీ9 గతంలో నిష్పక్షపాతంగా ఉండేదని, కానీ కేసీఆర్ సన్నిహితుడు రామేశ్వర్ రావు అందులో ప్రధాన వాటా కొనుగోలు చేశాక టీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేస్తోందని ఆరోపించారు. ఈ మూడు సంస్థలు 24 గంటల్లో తనకు క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

Similar News