కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రభావం చాలా తక్కువ. గత ఎన్నికల్లో జిల్లాలో కేవలం ఒక్కటంటే ఒక్క సీటే ఆ పార్టీ గెలవగలిగింది. జిల్లా మొత్తం ఏకపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది. అయితే, గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి నాలుగేళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా కడపను అభివృద్ధి చేశామని ఆయన ప్రచారం చేస్తున్నారు. తరచూ ఏదో ఓ కార్యక్రమం పేరుతో ఆయన జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే, ఈ ఎన్నికల్లోనైనా ప్రభావం చూపాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలకు సొంత పార్టీ తమ్ముళ్లే బ్రేకులు వేస్తున్నారు.
తమ్ముళ్ల కుమ్ములాటలు....
ఇప్పటికే జమ్మలమడుగు నియోజకవర్గంలో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన మంత్రి ఆదినారాయణ రెడ్డికి, రామసుబ్బారెడ్డికి తీవ్ర రాజకీయ వైరం ఉంది. ఇక పులివెందుల, బద్వేల్ నియోజకవర్గాల్లో కూడా టీడీపీలో రెండు గ్రూపులు కొనసాగుతున్నాయి. అయితే, జిల్లాలో టీడీపీని బలోపేతం చేసే బాధ్యతలు తీసుకున్న జిల్లాకు చెందిన టీడీపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్ వైఖరి వైఖరి పట్ల స్వంత పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సీఎం రమేశ్ అన్ని నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలను ప్రొత్సహిస్తున్నారని విమర్శిస్తున్నారు.
పంచాయతీకి ఎక్కువ మండలానికి తక్కువ...
ఈ నేపథ్యంలో టీడీపీ పొద్దుటూరు నియోజకవర్గం ఇంఛార్జి వరదరాజులు రెడ్డి..సీఎం రమేశ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రమేశ్ స్థాయి పంచాయతీకి ఎక్కువ మండలానికి తక్కువ అని ఎద్దేవా చేశారు. ఆయన ముఖ్యమంత్రి దయతో రాజ్యసభ పదవి తెచ్చుకున్నాడని ఆరోపించారు. ఆయనకు ఎన్నికల్లో గెలిచే సత్తా లేదని పేర్కొన్నారు. ఫ్యాక్షన్ కుటుంబానికి చెందిన రమేశ్ పార్టీలో వర్గ రాజకీయాలను ప్రోత్సహిస్తూ నేతల మధ్య చిచ్చు పెడుతున్నాడని విమర్శించారు. సీఎం రమేశ్ వైసీపీతో చేతులు కలిపి పార్టీని నాశనం చేస్తున్నాడని ఆరోపించారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో పార్టీని రెండు మెట్లు పైకి ఎక్కించాలనుకుంటుంటే ఆ పార్టీ నేతలు మాత్రం నాలుగు మెట్లు కిందకు నెడుతున్నట్లుగా పరిస్థితి తయారైంది. అయితే, క్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు నాయుడు ఏ విధంగా గాడిన పెడతారో చూడాలి.