వీళ్లకు జగన్ వద్దు! ఎందుకంటే..?

ఆంధ్రప్రదేశ్ లో ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ అనే కార్యక్రమం గురువారం నుంచి మొదలయింది. గత నాలుగున్నరేళ్లలో జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా ఇంటి ముంగిటకే చేరువైన పథకాలు, అవినీతి లేకుండా, డైరెక్ట్‌గా అకౌంట్లో పడుతున్న పథకాల నిధులు, తొంభై తొమ్యిది శాతం వరకూ అమలైన హామీలు... ఇలా ఆంధ్రప్రదేశ్‌కు జగన్‌ ఎందుకు అవసరమో చెప్పడానికి అధికార పార్టీ సిద్ధమవుతోంది.

Update: 2023-11-09 07:12 GMT


జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వర్గాలు ఇవే!

ఆంధ్రప్రదేశ్ లో ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ అనే కార్యక్రమం గురువారం నుంచి మొదలయింది. గత నాలుగున్నరేళ్లలో జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా ఇంటి ముంగిటకే చేరువైన పథకాలు, అవినీతి లేకుండా, డైరెక్ట్‌గా అకౌంట్లో పడుతున్న పథకాల నిధులు, తొంభై తొమ్యిది శాతం వరకూ అమలైన హామీలు... ఇలా ఆంధ్రప్రదేశ్‌కు జగన్‌ ఎందుకు అవసరమో చెప్పడానికి అధికార పార్టీ సిద్ధమవుతోంది.

కానీ ఏపీకి జగన్‌ అవసరం లేదని చెబుతున్న వర్గాలు కూడా ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఆయా పార్టీల ఓటు బ్యాంకుగా ఏళ్ల తరబడి మిగిలిపోయిన వీరాభిమానులు... వీళ్లంతా వైకాపాకు ఓటు వేయమన్నా వేయరు. సోషల్‌ మీడియాల్లో యాక్టివ్‌గా ఉండే వీళ్లే. అధికార పార్టీపై నిరంతరం విరుచుకుపడేది కూడా వీరే.

జగన్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవకూడదని కోరుకునేవాళ్లు కూడా ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్నారు. వాళ్లలో మొదటి వర్గం ప్రభుత్వ ఉద్యోగులు. గత నాలుగేళ్లుగా వాళ్లకు జీతాలు తప్ప ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు అందలేదు. జగన్‌ గెలిచిన కొత్తలో ఇచ్చిన మధ్యంతర భృతి తప్ప ఉద్యోగులు ఆనందపడే ఎలాంటి మేలూ వాళ్లకు జరగలేదు. 2022 లో జరిగిన జీతాల పెంపు కూడా ప్రభుత్వ ఉద్యోగుల అసంతృప్తి, ఆగ్రహానికి కారణమైంది. మధ్యంతర భృతి కంటే తక్కువగా జీతాలను పెంచారు. పెండింగ్ డీఏలను కలిపి జీతాలు పెరిగాయని, బలవంతంగా పీఆర్సీని ఉద్యోగులపై రుద్దారు. ఇది కాక డీఏ బకాయిలు. లీవ్‌ సరెండర్‌ డబ్బులు.. ఇవేవీ తొంభై శాతం ఉద్యోగులకు అందలేదు. ప్రస్తుతం ప్రతీ నెలా జీతం పడితే చాలనే పరిస్థితిలో ఉద్యోగులున్నారు. వీళ్లలో చాలామంది జగన్‌కు ఓటేయరని ఉద్యోగ సంఘ నాయకులే చెబుతున్నారు.

ప్రభుత్వ పథకాల పరిధిలో లేని వాళ్లంతా... సంక్షేమం పేరుతో ఉచితంగా డబ్బులు పంచి పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిస్తున్నారు. తాము పన్నుల రూపంలో కడుతున్న డబ్బును అనర్హులకు సైతం ఉచితంగా ఇచ్చి, ప్రభుత్వం సోమరిపోతులను తయారు చేస్తోందనే భావనలో వాళ్లంతా ఉన్నారు. సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు వంటి వాళ్లు కూడా జగన్‌ ప్రభుత్వంపై వ్యతిరేక భావనలో ఉన్నారు. ఓ డాక్టర్‌ మాట్లాడుతూ ఉచిత పథకాల వల్ల కిందస్థాయి పనివాళ్లు దొరకడం లేదని, హాస్పిటల్‌లో సేవల మీద దాని ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో అభివృద్ధి లేదని, సరైన ఉపాధి అవకాశాలు లేవని కొందరు నిరుద్యోగులు కూడా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబుపై సింపతీ ఉన్న వాళ్లు కూడా జగన్‌పై అసంతృప్తిగా ఉన్నారు.

సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎక్కువ మంది ఉండటంతో, తాము మరోసారి అధికారంలోకి వస్తామని వైకాపా నేతలు ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘వ్యతిరేక’ వర్గం ఓట్లు తమపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చనేది వాళ్ల భావన. 2024 జూన్‌ నాటికి ఈ విషయంపై అందరికీ ఓ క్లారిటీ వచ్చేస్తుంది.

Tags:    

Similar News