సోమును దెెబ్బకొట్టడానికి టీడీపీ ప్లాన్
టీడీపీకి సోము వీర్రాజు అడ్డంకిగా మారారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో పొత్తుతో వెళ్లాలన్నది చంద్రబాబు ఆలోచన.
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎవరికీ మింగుడు పడరు. కొరకరాని కొయ్య అని చెబుతారు. ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చి బీజేపీ లో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. మరికొద్ది కాలమే సోము వీర్రాజు ఈ పదవిలో కొనసాగుతారు. రెండేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత కొత్త అధ్యక్షుడు వస్తారా? లేదా? అన్నది పక్కన పెడితే ఆయన కొనసాగింపుపై బీజేపీలో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది.
పొత్తుకు అడ్డంకి...
ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సోము వీర్రాజు అడ్డంకిగా మారారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో పొత్తుతో వెళ్లాలన్నది చంద్రబాబు ఆలోచన. అయితే టీడీపీతో పొత్తును తొలి నుంచి వ్యతిరేకిస్తుంది సోము వీర్రాజు వర్గమనే చెప్పాలి. చంద్రబాబును నమ్మితే మరోసారి మోసపోతామని హైకమాండ్ ను కూడా నమ్మించగలిగారు. సోము వర్గమయితే 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు మోదీ పై చేసిన వ్యాఖ్యలను తర్జుమా చేసి మరీ ఢిల్లీకి పంపిందంటారు.
డిపాజిట్ కూడా...
అందుకే సోము వీర్రాజును ఈ పదవి నుంచి ముందు దించగలిగితే సగం విజయం సాధించినట్లేనన్నది టీడీపీ ఆలోచన. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు అవసరమని చంద్రబాబుకు తెలుసు. అందుకే ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ రాకుండా టీడీపీ చేసిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ ఎటూ గెలవదని తెలుసు. అయినా సోము వీర్రాజు నాయకత్వంపై అనుమానాలు రేకెత్తించడానికి టీడీపీ తమ ఓటు బ్యాంకును వైసీపీకి మరల్చిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ఇన్ని ఓట్లా...?
ఆత్మకూరు ఉప ఎన్నికలో నిజంగా వైసీపీని వ్యతిరేకించే వారు బీజేపీకి ఓట్లేయాలి. కానీ అలా జరగలేదు. వైసీపీకి అత్యధిక మెజారిటీ లభించడంతో పాటు బీజేపీకి కేవలం 19,316 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ బీఎస్పీకి4,897 ఓట్లు, నోటాకి 4,197 ఓట్లు వచ్చాయి. ఇతరులకు 6,599 ఓట్లు వచ్చాయి. బద్వేలు తరహాలో ఇక్కడ బీజేపీకి టీడీపీ నుంచి సహకారం లభించలేదు. దీనికి సోము వీర్రాజు మీద వ్యక్తిగత కోపమే కారణమంటున్నారు. అందుకే టీడీపీ అనుకూల ఓట్లు సయితం వైసీపీకి మలచారన్న కామెంట్స్ బలంగా వినపడుతున్నాయి.