హైదరాబాద్ మెట్రో రైలు చార్జీలు పెంచాలన్న ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. అందిన సమాచారం మేరకు పలు మార్లు మెట్రో చార్జీలను పెంచాలని ఎల్ అండ్ టి నుంచి ఒత్తిడులు వచ్చినప్పటికీ, ఆ సంస్థతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రస్తుతం ఉన్న మెట్రో బోగీలను పెంచకుండా, ప్రయాణికులకు మరిన్ని మౌలిక సదుపాయాలను కల్పించేంతవరకు చార్జీల పెంపుకు ఎట్టిపరిస్థితిలోనూ అంగీకరించేది లేదని ప్రభుత్వం ఖరాఖండీగా చెప్పినట్లు తెలిసింది. హైదరాబాద్ మెట్రో రైలు లో ప్రయాణ చార్జీల పెంపుపై ప్రతిపాదనలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2022 సెప్టెంబర్ 5 వ తేదీన ఫెయిర్ ఫిక్ షెషన్ కమిటీ (FFC ) ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి రిటైర్డ్ జస్టిస్ గుడి సేవా శ్యామ్ ప్రసాద్ ను చైర్మన్ గా, కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రటరీ డాక్డర్ సురేంద్ర కుమార్ బాగ్డే, రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ స్పెషల్ సి.ఎస్. అరివింద్ద్ కుమార్ లను సభ్యులుగా నియమించింది.
బోగీలను పెంచకుండా...
అదే ఏడాది అక్టోబర్ 27 న భాద్యతలను చేపట్టిన ఈ కమిటీ పలుమార్లు సమావేశమై విస్తృత స్థాయిలో చర్చలు జరిపి తన నివేదికను అంగీకారం కోసం ప్రభుత్వం ముందుంచింది. కరోనా తీవ్రత నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో ప్రజలపై ఏవిధమైన ఆర్థిక భారం పడకూడదని ఈ ప్రతిపాదనలను తోసిపుచ్చింది. ఇప్పుడ మెట్రో చార్జీలను పెంచితే ఇది మెట్రో ప్రయాణికులకు భారంగా మారి దీని ప్రభావం ట్రాఫిక్ మూవ్‌మెంట్ పై చూపిస్తుందని అంటున్నారు. పైగా, ముందస్తు ఒప్పందం ప్రకారం బోగీల సంఖ్యను కూడా పెంచలేదని ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కరోనాకు ముందు నిత్యం నాలుగు లక్షల మందికి పైగా మెట్రోలో ప్రయాణం చేసేవారు. కరోనా ప్రభావంతో ఈ సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఇప్పుడిప్పుడే తిరిగే ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో చార్జీల పెంపు తగదని ప్రభుత్వ పెద్దలు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
మౌలిక సదుపాయాలు...
ఆర్టీసీ బస్ తో పోల్చితే మెట్రో చార్జీలు ఎక్కువైనప్పటికీ ప్రయాణ సమయం ఆదా, ఏ.సి. సౌకర్యం వల్ల మెట్రోలోనే ప్రయాణానికి మొగ్గుచూపుతున్నారు. ఛార్జీలు పెంచితే, ప్రయివేటు రవాణ వ్యవస్థ తరహాలో మెట్రో కూడా ప్రమాదముందని కూడా అంటున్నారు. ఇప్పటికే మెట్రో రైళ్లలో జనం ఎక్కువగా ఉంటున్నారు. నిలుచుని ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదనపు బోగీలు వేయకుండా ఛార్జీలు పెంచడం, ప్రయాణికులకు మౌలిక సదుపాయాలను కల్పించక పోవడం తదితర కారణాలతో మెట్రో చార్జీలు పెంచాలన్న కమిటీ ప్రతిపాదనలను ప్రాధమిక స్థాయిలోనే ప్రభుత్వం తోసి పుచ్చినట్లు సమాచారం. కానీ ఎల్ అండ్ టి సంస్థ తమకు నష్టాలు రాకుండా ఉండాలంటే ఛార్జీలు పెంచాలని కోరుతుంది. ప్రభుత్వం మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు.