"సూర్య" షాట్లకు లంకేయులకు వడదెబ్బ

శ్రీలంకతో జరిగే చివరి టీ 20లో సూర్యకుమార్ చెలరేగి ఆడాడు. శీతాకాలంలో సూర్య లంక బౌలర్లకు చెమటలు పట్టించాడు

Update: 2023-01-07 15:09 GMT

అంతే.. సూర్యకుమార్ యాదవ్ క్రీజులో నిలబడితే చాలు. బౌలర్లకు చుక్కలు కనపడతాయి. శ్రీలంకతో జరిగే చివరి టీ 20లో సూర్యకుమార్ చెలరేగి ఆడాడు. శీతాకాలంలో సూర్య లంక బౌలర్లకు చెమటలు పట్టించాడు. మిస్టర్ 360 షాట్లకు లంకేయులు చూస్తూ ఉండిపోవడం తప్ప మరేమీ చేయలేకపోయారు. సూర్య ను అవుట్ చేస్తేనే భారత్ భారీ స్కోరు ను చేయకుండా నిలువరించగలమన్న లంక బౌలర్ల ఆశలు అడియాసలే అయ్యాయి. సూర్యకుమార్ ఫోర్ తో షాట్ ను ముగిస్తే చాలు అని శ్రీలంక బౌలర్లు మనసులో అనుకుని ఉండొచ్చు.

మిస్టర్ 360...
ఆ వైపు.. ఈ వైపు అని కాదు.. గ్రౌండ్ నలముూలలా షాట్లు కొడుతూ సూర్యకుమార్ యాదవ్ తన సత్తాను మరోసారి నిరూపించాడు. అవసరమైన మ్యాచ్ లో సూర్య పర్‌ఫెక్ట్ షాట్లతో విరుచుకుపడటంతో లంకేయులు నిస్తేజంతో చూస్తూ ఉండిపోయారు. మిగిలిన బ్యాటర్లు అవుటవుతున్నా సూర్యకుమార్ క్రీజులోనే ఉండటంతో భారత్ కు భారీ స్కోరు లభించింది. ఒక్క శ్రీలంకకే కాదు అన్ని దేశాల క్రికెటర్లకు సూర్యను వేగంగా పెవిలియన్ కు పంపించడంపై ఎక్కువ గేమ్ ప్లాన్ చేయాల్సి ఉంటుందనడంలో ఎటవంటి సందేహం లేదు.
అచ్చమైన షాట్లు...
ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ నిలబడితే స్కోరు బోర్డు పరుగులు తీస్తుంది. టీ 20 కి అచ్చమైన ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ అనే చెప్పుకోవాలి. 51 బాల్స్ లో 112 పరుగులు చేశాడు. కేవలం 45 బాల్స్ లోనే సెంచరీ సాధించిన సూర్యను ఏమని పొగడాలి. భారత్ కు విజయం దక్కుతుందా? లేదా? అన్నది కొంచెం సేపు పక్కన పెడదాం. వీకెండ్ లో మాత్రం క్రికెట్ ప్రియులకు తనదైన షాట్లతో సిసలైన మజాను అందించాడు సూర్య. పొగిడితే దిష్టి తగులుతుందంటారు. అందుకే పొగడ్తలకన్నా.. సూర్య పదునైనా షాట్ల కోసం మనం ప్రతి మ్యాచ్ లో ఎదురు చూడాల్సిందే.
భారీ స్కోరు
సూర్యకుమార్ యాదవ్ ఎప్పుడూ అంతే నిలదొక్కుకుంటే ఫిఫ్టీ గ్యారంటీ. అవుట్ కావడం వైరి పక్షం ఇంకొంత ఆలస్యం చేస్తే సెంచరీ ఖచ్చితమే. అంత భయం ప్రత్యర్థులకు. అందుకే శ్రీలంకతో జరిగే చివరి వన్డేలో భారత్ అత్యధిక పరుగులు చేయగలిగింది. బౌలర్లను చెడామెడా ఆడేసుకున్న సూర్య దెబ్బకు నిజంగా శీతాకాలంలో వడ దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఇరవై ఓవర్లకు భారత్ స్కోరు228. ఐదు వికెట్లు కోల్పోయి ఈ పరుగులు సాధించింది. ఇది శ్రీలంకకు అంత సులువేమీ కాదు. ఏం జరుగుతుందనేది మరో మూడు గంటలు వెయిట్ చేయాలి.


Tags:    

Similar News