టిక్కెట్ గ్యారంటీ లేదు.. నిరాశలో నేతలు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు పొత్తుకు సిద్ధమవుతారు. మరి అప్పుడు తమ పరిస్థితి ఏంటి? అన్న చర్చ పార్టీ నేతల్లో జరుగుతుంది

Update: 2022-06-27 03:43 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పొత్తుకు సిద్ధమవుతారు. మరి అప్పుడు తమ పరిస్థితి ఏంటి? అన్న చర్చ పార్టీ నేతల్లో జరుగుతుంది. చంద్రబాబు జిల్లాల పర్యటన ప్రారంభించారు. ఇప్పటి వరకూ ఆయన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటించారు. అనకాపల్లి, నెలిమర్లలో మినీ మహానాడులు పెట్టారు. పొత్తులు ఉన్నా పార్టీకి పట్టున్న నియోజకవర్గాల్లోనే జిల్లాల్లో మినీ మహానాడులు పెట్టాలని చంద్రబాబు ఆదేశించినట్లు చెబుతున్నారు.

పొత్తులు కుదిరితే...
టీడీపీకి పట్టున్న ప్రాంతం, జనసేన బలహీనంగా ఉన్న చోట పొత్తు అవకాశముండదు. ప్రధానంగా ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కోస్తాంధ్రలో ఈసమస్య ఎదురవుతుంది. చంద్రబాబు 175 నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉండాలని భావిస్తున్నారు. అక్కడి నేతలను వెనకబడి తరుముతున్నారు. మహానాడు, మినీమహానాడులకు జనాన్ని తరలించాల్సిన బాధ్యత ఈ నేతలపై ఉంచారు. ఇది ఖర్చుతో కూడుకున్న అంశమే.
రెండేళ్లకు ఎన్నికలు...
మరో రెండేళ్లకు కాని ఎన్నికలు జరగవు. ఈ రెండేళ్లు పార్టీని నియోజకవర్గంలో బతికించుకోవాలంటే కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. అందుకు నేతలు కొందరు సిద్ధమే అయినా, టిక్కెట్ వస్తుందో? రాదో అన్న సందేహం వారిలో నెలకొంది. ఎన్నికలు సమీపించిన తర్వాత పొత్తులు కుదుర్చుకుని తాము కష్టపడిన, ఖర్చు చేసిన నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా మిత్ర పక్షాలకు కేటాయిస్తే ఎలా అన్న సందేహం నేతల్లో వ్యక్తమవుతుంది. అయితే నేతల సందేహాలకు ఇప్పుడప్పుడే జవాబు చెప్పే పరిస్థితి ఉండదు.
కొన్ని నియోజకవర్గాల్లో....
కానీ అంచనా వేసుకున్న నేతలు కొందరు ఆ నియోజకవర్గాల్లో ఖర్చు తగ్గించే పనిలో పడ్డారని వినికిడి. గ్యారంటీ లేని టిక్కెట్ తో వృధా ప్రయాస ఎందుకన్న ధోరణిని కొంతమంది నేతలు ప్రదర్శిస్తున్నారు. అది ఉత్తరాంధ్ర జిల్లాల చంద్రబాబు పర్యటనలోనే బయటపడిందట. పార్టీ అధినేతకు ఈ మేరకు సమాచారం కూడా అందింది. జనసేనకు కేటాయించే అవకాశమున్న నియోజకవర్గాల నుంచి జనసమీకరణ జరగలేదంటున్నారు. రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి ఉంటుందంటున్నారు. అందుకే పొత్తులపై చంద్రబాబు స్పష్టత నిస్తే తప్ప కొన్ని కీలక నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు యాక్టివ్ కారట.


Tags:    

Similar News