కమలం గూటికి....కనకమేడల.. అందుకేనా?

రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ త్వరలోనే బీజేపీలో చేరతారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతుంది.

Update: 2022-08-09 07:01 GMT

తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ స్థానాలు అచ్చి రావడం లేదు. చంద్రబాబు నమ్మి పదవులు ఇచ్చిన నేతలు కూడా పార్టీని వీడుతున్నారు. టీడీపీకి అది శాపమో ఏమో తెలియదు కాని రాజ్యసభ స్థానాలు పొందిన వారిలో 99 శాతం మంది పార్టీని వీడటమో, రాజకీయాల నుంచి తప్పుకోవడమో జరుగుతుంది. తాజాగా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ఆయన త్వరలోనే బీజేపీలో చేరతారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. క్యాసినో వ్యవహారం మెడకు చుట్టుకుంటుందన్న కారణంగా కనకమేడల బీజేపీలోకి వెళతారన్న ప్రచారం బలంగా జరుగుతుంది.

ఆయన వెళితే...
ఇటీవల చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఆయన వెన్నంటే ఉన్నా త్వరలోనే ఆయన టీడీపీకి గుడ్ బై చెబుతారంటున్నారు. రాజ్యసభలో ఉన్న ఒకే ఒక్కడు కూడా బీజేపీలోకి వెళితే పెద్దల సభలో టీడీపీకి ప్రాతినిధ్యమే ఉండకుండా పోతుంది. చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో కనకమేడల రవీంద్రకుమార్ పాస్ లను విదేశాలకు వెళ్లేందుకు ఉపయోగించాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే ఆయన ఖాతాలోకి పెద్దమొత్తంలో నగదు బదిలీ జరిగిందని కూడా ఎన్‌‌ఫోర్స్‌మెంట్ అధికారులు గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. కనకమేడలకు ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
క్యాసినో వ్యవహారం....
ఈ నేపథ్యంలో కనకమేడల రవీంద్ర కుమార్ టీడీపీని వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని హస్తినలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. నిజానికి ఈ పదవి వర్ల రామయ్యకు దక్కాల్సి ఉంది. న్యాయవాదిగా ఉన్న, తన సామాజికవర్గానికే చెందిన కనకమేడల రవీంద్రకుమార్ కు చంద్రబాబు చివరి నిమిషంలో పార్టీ పదవిని ఇచ్చారు. ఆయనయితే ఢిల్లీలో తనకు ఉపయోగపడతారని అంచనా వేశారు. కానీ కనకమేడల కూడా సైకిల్ దిగి చంద్రబాబుకు హ్యాండ్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.
ఈడీ కేసుల నుంచి...
ఈడీ కేసుల నుంచి తప్పించుకోవాలంటే ఆయనకు అంతకు మించి మరో మార్గం లేదు. రాజ్యసభ నుంచి నలుగురు ఎంపీలు 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే బీజేపీ లోకి వెళ్లినా కనకమేడల మాత్రం టీడీపీలో కొనసాగారు. తాను చంద్రబాబుకు నమ్మకమైన వ్యక్తిని అని చెప్పుకున్నారు. కానీ చివరకు ఆయన కూడా ఇక పార్టీ వీడే పరిస్థితులు ఏర్పడ్డాయంటున్నారు. కనకమేడలకు ఇంకా రాజ్యసభ పదవీకాలం ఒకటిన్నర ఏడాది ఉండటంతో ఆయన చేరికకు బీజేపీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. రాజ్యసభలో తమకు బలం అవసరం కాబట్టి ఎవరు వచ్చినా బీజేపీ అక్కున చేర్చుకుంటుంది. క్యాసినో వ్యవహారం ముదరకముందే కనకమేడల జంప్ అవుతారన్న ప్రచారం ఢిల్లీలో జోరుగా జరుగుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Tags:    

Similar News