ఉండవల్లికి కేసీఆర్ బంపర్ ఆఫర్
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఫాస్ట్ గా ఎదగాలనుకుంటున్నారు. రెండేళ్లలోనే లోక్‌సభ ఎన్నికలున్నాయి. ఈ ఎన్నికలలోపే జాతీయంగా పార్టీని పటిష్టం చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా మేధావులు, పార్టీ నేతలతో కేసీఆర్ వరస సమావేశాలు నిర్వహిస్తున్నారు. భారత రాష్ట్ర సమితి అని పార్టీని త్వరలోనే ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ చేయించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాజ్యసభలో సీనియర్ నేతకు ఈ బాధ్యతను అప్పగించినట్లు చెబుతున్నారు.
కేసీఆర్ తో భేటీ...
నిన్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉండవల్లి అరుణ్ కుమార్ తో కేసీఆర్ భేటీ అయ్యారు. అయితే ఈ సందర్బంగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. రాజ్యసభ కు ఉండవల్లిని పంపాలన్న తన మనసులో మాటను ఆయన ఈ సందర్భంగా బయటపెట్టినట్లు సమాచారం. ఉండవల్లికి జాతీయ రాజీకీయాలపై కొంత పట్టుంది. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
ఢిల్లీలో అధికార ప్రతినిధిగా...
ఢిల్లీలో పార్టీకి స్పోక్స్ పర్సన్ గా కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ ను నియమించాలని కేసీఆర్ భావిస్తున్నారు. కేవలం అధికార ప్రతినిధిగా మాత్రమే కాకుండా ఉండవల్లికి రాజ్యసభ పదవి ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో కొత్త పార్టీ వాణిని వినిపించేందుకు ఉండవల్లి సరైన వ్యక్తి అని కేసీఆర్ నమ్ముతున్నారు. జాతీయ పార్టీ కావడంతో ఆంధ్ర, తెలంగాణ అని చూడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే జగన్ తెలంగాణకు చెందిన ఆర్. కృష్ణయ్య, నిరంజన్ రెడ్డిలను రాజ్యసభ సభ్యులను చేసి సరిహద్దులను చెరిపేశారు.
సున్నితంగా....
దీంతో ఉండవల్లికి రాజ్యసభ పదవి ఇచ్చి ఆయనను ఢిల్లీలో కొత్త పార్టీకి అధికార ప్రతినిధిగా నియమించాలని భావించారు. ఈ ప్రతిపాదనను ఉండవల్లి సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. తాను ప్రస్తుత రాజకీయాలకు దూరంగా ఉండదలచుకున్నానని, తనకు ఏ పదవి అవసరం లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్లు తెలిసింది. అయితే రాజ్యసభ పదవి ఇచ్చేందుకు ఇంకా సమయం ఉండటంతో తర్వాత ఆలోచించ వచ్చునని కేసీఆర్ ఉండవల్లికి చెప్పినట్లు సమాచారం. ఇద్దరి మధ్య మూడు గంటలకు పైగానే చర్చలు జరిగాయి. అయితే జాతీయ పార్టీ నడపటం అంత సులువు కాదని కూడా ఉండవల్లి కేసీఆర్ కు తేల్చి చెప్పినట్లు చెప్పారు. మరి కొద్దిసేపట్లో ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా సమావేశం పెట్టనున్నారు. ఈ సమావేశంలో ఉండవల్లి చర్చల సారాంశాన్ని చెప్పనున్నట్లు సమాచారం.