గ్యాప్ వచ్చింది అందుకేనా?
పాలనను రాజ్ భవన్ నియంత్రిస్తుందన్న సంకేతాలను ప్రజల్లో బలపడాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకుంటున్నారు.
అవును.. మమత బెనర్జీ మూడో సారి గెలిచింది ఖచ్చితంగా ఆమె క్రేజ్ వల్ల కాదు. ప్రత్యర్థుల బలహీనత వల్ల కాదు. కేవలం ఒకే ఒకరు మమత బెనర్జీ ని గత ఎన్నికల్లో మూడోసారి ప్రజలు గెలిపించారు. దీనికి కారణం ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్. ప్రజలు తో గవర్నర్ కు నేరుగా సంబంధాలు లేకపోయినా ఆయన తీసుకున్న నిర్ణయాలు మమతకు గత ఎన్నికలలో వరంగా మారాయంటారు. ఇప్పుడు తెలంగాణలోనూ తనకు అదే తరహా విజయం దక్కాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరుకుంటున్నట్లుంది.
ఇబ్బంది కలిగించిన....
నిజానికి తెలంగాణ గవర్నర్ ప్రభుత్వానికి పెద్దగా ఇబ్బంది కలిగించిన అంశం ఏమీలేదనే చెప్పాలి. ఒకే ఒక అంశాన్ని గవర్నర్ ప్రశ్నించారు. ఫైలును కొన్నాళ్లు తొక్కిపెట్టారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో పాడె కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలనుకున్న కేసీఆర్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేయాలనుకున్నారు. మంత్రివర్గం ఆమోదించి గవర్నర్ కు ఫైలు పంపితే సేవా కేటగిరి కింద కౌశిక్ రెడ్డి రాడని భావించి గవర్నర్ తమిళిసై ఆ ఫైలును తొక్కిపెట్టారు.
ఆ ఫైలు మాత్రం కాదు...
అయితే గవర్నర్ ఈ ఫైలును క్లియర్ చేయరని భావించి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేశారు కేసీఆర్. నిజానికి కౌశిక్ రెడ్డి నియామకంలో గవర్నర్ వాదనతో కేసీఆర్ కూడా ఏకీభవించినట్లు తెలిసింది. గవర్నర్ తో విభేదాలు ఈ ఫైలు కారణం కాదు. ప్రశాంత్ కిషోర్ వ్యూహరచనలో భాగంగానే ప్రభుత్వం గవర్నర్ ను టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు. గవర్నర్ ఎంత రెచ్చిపోతే తమకు అంత లాభమన్న అంచనాలో ఉన్నారు. గవర్నర్ కూడా నేడు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు. ఆ తర్వాత గవర్నర్ కూడా దూకుడు పెంచే అవకాశముంది.
కొన్ని వర్గాలను....
అన్ని రకాలుగా వ్యూహాలను సిద్ధం చేసి హ్యాట్రిక్ విజయాన్ని సాధించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. గవర్నర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరిన్ని నిర్ణయాలు తీసుకోవాలని కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారు. పాలనను రాజ్ భవన్ నియంత్రిస్తుందన్న సంకేతాలను ప్రజల్లో బలపడాలని కేసీఆర్ కోరుకుంటున్నారు. దీనివల్ల తమ పార్టీకి దూరమైన కొన్ని వర్గాలు తిరిగి దగ్గరయ్యే అవకాశాలున్నాయని కేసీఆర్ భావిస్తున్నారు. నిజానికి రాజ్ భనవ్ తో పెద్దగా విభేదాలు లేకపోయినా గవర్నర్ టార్గెట్ వెనక కోల్ కత్తా వ్యూహమే దాగి ఉందని చెబుతున్నారు.