పవన్ జోరు.. సైకిల్ బేజారు..!

తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఓ కొత్త టెన్షన్‌ మొదలైంది. వారాహి నాలుగో యాత్రను మొదలు పెట్టడం ద్వారా పవన్‌ కళ్యాణ్‌... తన స్పీడును పెంచారు. రాబోయే ఎన్నికలకు తెలుగుదేశంతో పొత్తు ఉంటుందని ప్రకటించిన జనసేనాని, సీఎం పదవిపై కూడా తనకు ఆశలున్నాయని పరోక్షంగా ప్రకటిస్తున్నారు. హడావుడిగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో తన పర్యటన మొదలు పెట్టారు. దాదాపు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇలా పవన్‌ దూసుకుపోతుంటే... దిక్కుతోచని స్థితిలో నలభై ఏళ్ల పార్టీ కొట్టుమిట్టాడుతోంది.

Update: 2023-10-03 07:30 GMT

తెలుగుదేశంలో ‘పవన్‌’ టెన్షన్‌

రంగంలోకి నారా భువనేశ్వరి

తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఓ కొత్త టెన్షన్‌ మొదలైంది. వారాహి నాలుగో యాత్రను మొదలు పెట్టడం ద్వారా పవన్‌ కళ్యాణ్‌... తన స్పీడును పెంచారు. రాబోయే ఎన్నికలకు తెలుగుదేశంతో పొత్తు ఉంటుందని ప్రకటించిన జనసేనాని, సీఎం పదవిపై కూడా తనకు ఆశలున్నాయని పరోక్షంగా ప్రకటిస్తున్నారు. హడావుడిగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో తన పర్యటన మొదలు పెట్టారు. దాదాపు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇలా పవన్‌ దూసుకుపోతుంటే... దిక్కుతోచని స్థితిలో నలభై ఏళ్ల పార్టీ కొట్టుమిట్టాడుతోంది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు. పార్టీని నడిపించాల్సిన లోకేష్‌ ఢిల్లీలో ఉండిపోయారు. లాయర్లతో మంతనాలు అని సైకిల్‌ పార్టీ నేతలు చెబుతున్నా, అరెస్ట్‌ భయంతో ఏపీలోకి రావడం లేదని వైకాపా నేతలు విమర్శిస్తున్నా.. ఆయన లేనిలోటు పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీని ముందుండి నడిపించి, తన నాయకత్వాన్ని రుజువు చేసుకోవాల్సిన కీలక అవకాశాన్ని లోకేష్‌ చేతులారా పోగొట్టుకుంటున్నారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి పార్టీ కోసం కష్టపడుతున్నా పార్టీకి రావాల్సిన మైలేజీ రావడం లేదు. దీనిపై కార్యకర్తలు కూడా నిరాశగానే ఉన్నారు.

ఈ నేపథ్యంలో పవన్‌ హడావుడిగా వారాహి యాత్రను ప్రారంభించడం తెలుగుదేశం వర్గాలకు నచ్చడం లేదు. చంద్రబాబు అరెస్ట్‌ కంటే, పవన్‌ యాత్ర హైలైట్‌ అవుతోందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. అప్పటికీ తెలుగుదేశం అనుకూల మీడియా జనసేనాని యాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోయినా, ప్రస్తుత పరిస్థితుల్లో ‘వారాహి’ తమకు ప్రతికూలంగా మారుతుందని తమ్ముళ్లు అనుకుంటున్నారు. ఈ ప్రభావం రాబోయే రోజుల్లో పొత్తుపై, సీట్ల పంపిణీపై ఉంటుందనేది నాయకుల భావన. జనసేన ఎక్కువ సీట్లు డిమాండ్‌ చేస్తే, వాటిలో ఎన్ని గెలవగలదో చెప్పే పరిస్థితుల్లో పవన్‌ లేరు. ఇది అంతిమంగా పార్టీ విజయావకాశాలను దెబ్బ తీస్తుందని వాళ్ల భావన.

ఈ నేపథ్యంలో పవన్‌ దూకుడుకి ముకుతాడు వేసేందుకు భువనేశ్వరి రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. త్వరలోనే ఆమె రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు. చంద్రబాబు అరెస్ట్‌తో ఆందోళన చెంది ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను ఆమె ఓదార్చునున్నారు. దీనివల్ల పార్టీ బలపడుతుంది. చంద్రబాబుపై సింపతీ పెరుగుతుంది. నారా కుటుంబానికి పార్టీపై పూర్తి పట్టు చిక్కుతుంది. ఇక ఎన్టీయార్‌ పేరు వాడక్కర్లేదు. మీడియా కవరేజీ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రధానంగా జనసేనానికి స్పీడుకు కళ్లెం వేయొచ్చు. అందుకే బస్సు యాత్రకు ఇదే సరైన సమయం, సందర్భమని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి.

Tags:    

Similar News