Weather AlerWeather Report : నేడు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం.. ఈ జిల్లాల్లో వర్షాలుt :
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఉష్ణోగ్రతలు కొంత తగ్గుముఖం పట్టాయి.;

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఉష్ణోగ్రతలు కొంత తగ్గుముఖం పట్టాయి. గత కొద్ది రోజుల నుంచి సాయంత్రానికి వర్షాలు పడుతుండటంతో అంతకు ముందు నమోదయిన గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. వారం రోజుల క్రితం వరకూ నలభై రెండు నుంచి నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఏప్రిల్ నెలకు చివరినాటికే నలభై ఐదు డిగ్రీలకు చేరతాయని అంచనా వేశారు.అయితే సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతోఉష్ణోగ్రతలు చాలా వరకూ తగ్గుముఖం పట్టాయి. అయితే నేటి నుంచి మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది.
అత్యధిక ఉష్ణోగ్రతలు...
ఆంధ్రప్రదేశ్ లోని 54 మండలాల్లో నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. అయితే ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు అనేక పంటలు దెబ్బతిన్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడటంతో పాటు ఈదురుగాలులు కూడా వీయడంతో మామిడి, నిమ్మ, బత్తాయి వంటి తోటలకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళనచెందుతున్నారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ఈ పంటలకు ఎక్కువ నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. ఈదురుగాలుల దెబ్బకు అనేక ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
తెలంగాణలో రెండు రోజులు...
అయితే తెలంగాణలో మాత్రం మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ ప్రాంతం మీదుగా విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా మంగళవారం కూడా కొన్ని చోట్ల మోస్తరు వర్షాలతో పాటు తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని తెలిపింది. ఈరోజు వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, కొత్త గూడెం, ములుగు, జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాలో ఉరుములతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని చెప్పింది. అలాగే బుధవారం కూడా వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా రైతులు అలెర్ట్ గా ఉండాలని సూచించింది.
వర్షం కురిసే ప్రాంతాలివే...
నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు ,అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్షసూచన చేసింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ హనుమకొండ, నాగర్‌కర్నూల్ జిల్లాలకు మోస్తరు వర్షసూచన ఉంది. రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడరాదన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.