వారిని దూరంగా ఉంచుతున్నారెందుకో?
ప్రజల నుంచి వారికి సరైన మద్దతు లేదని గ్రహించిన చంద్రబాబు ఈసారి కూడా వారిలో చాలా మందికి నో టిక్కెట్ అని చెప్పేస్తున్నారట
రాజకీయాల్లో అంతే. పార్టీ మారిన వాళ్లకు పెద్దగా విలువ ఉండదు. అది ఏ పార్టీ అయినా సరే. పార్టీ మారి వచ్చిన వాళ్లను పరాయి వాళ్లుగానే చూస్తారు. 2014 ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయారు. అలా పార్టీ మారి వచ్చిన నలుగురికి చంద్రబాబు మంత్రి పదవులను కూడా ఇచ్చారు. అయితే 2019 ఎన్నికలకు వచ్చే సరికి వీరిలో ఒక్కరు మాత్రమే గెలిచారు. గొట్టిపాటి రవికుమార్ ఒక్కరు మాత్రమే టీడీపీ నుంచి విజయం సాధించారు. మిగిలిన వాళ్లలో అనేక మందికి టిక్కెట్లు కూడా దక్కలేదు. వారు ఇప్పుడు కూడా ఊగిసలాటలో ఉన్నారు.
ఉనికి లేకుండా....
కొందరు పార్టీ మారి వచ్చిన వారు ఇతర పార్టీల్లో కొందరు చేరిపోగా, మరికొందరు మాత్రం నియోజకవర్గాల్లో ఉనికి లేకుండా కాలం వెళ్లబుచ్చుతున్నారు. వారికి వచ్చే ఎన్నికల్లో కూడా టిక్కెట్ దక్కే అవకాశం లేదు. ప్రజల నుంచి వారికి సరైన మద్దతు లేదని గ్రహించిన చంద్రబాబు ఈసారి కూడా వారిలో చాలా మందికి నో టిక్కెట్ అని చెప్పేస్తున్నారట. వారు ఇప్పుడు ఆలోచించుకుని ఇతర పార్టీలో చేరడమా? లేక టీడీపీలోనే కొనసాగి అధికారంలోకి వస్తే పదవులను ఆశించడమా? అన్నది వారే తేల్చుకోవాల్సి ఉంటుంది.
పార్టీ మారి వచ్చి....
2014లో పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, పాతపట్నం నుంచి కలమల వెంకటరమణ, బొబ్బిలి నుంచి సుజయకృష్ణ రంగారావు, అరకు నుంచి సర్వేశ్వరరావు, ప్రత్తిపాడు నుంచి వరపుల సుబ్బారావు, జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ, రంపచోడవరం నుంచి వంతల రాజేశ్వరి, పామర్రు నుంచి ఉప్పులేటి కల్పన, విజయవాడ వెస్ట్ నుంచి జలీల్ ఖాన్, ఎర్రగొండపాలెం నుంచి పాలపర్తి డేవిడ్ రాజు, అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్, కందుకూరు నుంచి పోతుల రామారావు, గిద్దలూరు నుంచి మత్తుముల అశోక్ రెడ్డి, గూడూరు నుంచి సునీల్ కుమార్, బద్బేలు నుంచి జయరాములు, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణరెడ్డి, ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ, శ్రీశైలం నుంచి బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కర్నూలు నుంచి ఎస్వీ మోహన్ రెడ్డి, కోడుమూరు నుంచి మణిగాంధీ, కదిరి నుంచి చాంద్ భాషా, పలమనేరు నుంచి అమర్ నాధ్ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరిపోయారు. వీరిలో ఆదినారాయణరెడ్డి, జయరాములు బీజేపీలో చేరిపోయారు.
వచ్చే ఎన్నికల్లోనూ....
జలీల్ ఖాన్ గత ఎన్నికల్లో తన కుమార్తె కు సీటు ఇప్పించుకున్నారు. ఇక మిగిలిన వారిలో జ్యోతుల నెహ్రూ కుటుంబంలో ఒకరికి సీటు గ్యారంటీ. కిడారి శ్రవణ్ కు కూడా టిక్కెట్ దక్కే అవకాశముంది. పోతుల రామారావు, భూమా అఖిలప్రియ, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, గిడ్డి ఈశ్వరి అమర్ నాధ్ రెడ్డిలకు టిక్కెట్ దక్కినా, మిగిలిన వారికి మాత్రం నో ఛాన్స్ అంటున్నారు. పాలపర్తి డేవిడ్ రాజు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లి తిరిగి టీడీపీలో చేరేందుకు ప్రయత్నించారు. కానీ ఇంతవరకూ చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు కూడా ఉండటంతో వీరిలో చాలామందికి చంద్రబాబు అపాయింట్ మెంట్ కూడా లభించే అవకాశం లేదు. సో....పార్టీ మారిన నేతల ఫేట్ వచ్చే ఎన్నికల్లో కూడా మారే అవకాశం లేదు.