ఉండవల్లి ఉఫ్...అంటూ ?

Update: 2018-10-09 12:30 GMT

ఏపీలో ముఖ్యమంత్రి తరువాత నెంబర్ 2 పొజిషన్ లో వున్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు తనతో ఎలాంటి చర్చకు సుముఖంగా లేరని మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ వెల్లడించారు. ఆయన తన ఫోన్లకు మెసేజ్ లకు ఎలాంటి స్పందన ఇవ్వలేదని తాజాగా వివరించారు. బలవంతంగా ఆయన్ను చర్చలో తాను కూర్చోబెట్టలేనని కానీ ప్రకృతి సేద్యం పేరుతో వేలకోట్ల వ్యాపారం కు బాబు శ్రీకారం చుట్టిన అంశాలపై తాను చేసిన ఆరోపణలకు సమాధానం కుటుంబరావు అయినా సమాధానం చెప్పాలని సవాల్ చేశారు ఉండవల్లి. అందుకే జపాన్ కి చెందిన మాకీ ఆంధ్రప్రదేశ్ కన్నా మాకీ నయం అంటూ ఏడుస్తూ పోయాడని ఇంతకన్నా అవమానం ఉంటుందా అన్నారు అరుణ కుమార్. చంద్రబాబు అక్బరుద్దీన్ ను కలవడానికి వెళ్లి మీ చుట్టూ వున్న పదిమంది తో ప్రభుత్వం నడిచిపోతుందనుకుంటే ఎలా అని నిలదీశారు ఉండవల్లి .

డ్యామ్ లేకుండా ప్రాజెక్ట్ పూర్తి అవుతుందా ...?

ఇటీవల గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోలవరం టూర్ చేశారని 2019 కి గ్రావిటీ మీద నీరంటూ యధావిధిగా ప్రచారం చేశారని గుర్తు చేశారు. అసలు ఎర్త్ కం రాక్ ఫీల్ డ్యామ్ కట్టకుండా నీరు ఎలా ఇస్తారని ఎవరూ ఆయనను ప్రశ్నించలేదని అరుణ కుమార్ నిలదీశారు. పోలవరం కుడి కాలువ 75 శాతం పనులు, ఎడమ కాలువ 7 శాతం పనులు అయ్యాయని స్పిల్ వే పూర్తి అయినా నీరు రాదని టన్నెల్ లు, డ్యామ్ పూర్తి అయితే నే గ్రావిటీ పై నీరు వస్తుందని కానీ దేవతా వస్త్రాలుగా ప్రచారం కోసం పోలవరం ప్రాజెక్ట్ ను వాడేస్తూ 20 కోట్ల రూపాయలను ఈ ప్రాజెక్ట్ ను సందర్శించే వారికోసం ఖర్చు పెట్టడం దారుణమని నిప్పులు చెరిగారు అరుణ కుమార్. చంద్రబాబు సర్కార్ చేస్తున్న ప్రచారానికి ఇంజనీర్లు నెత్తిన బెత్తంతో కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు ఉండవల్లి.

18 లక్షల కోట్ల పరిశ్రమలు అంతా బోగస్....

ఏపీలో 18 లక్షల కోట్ల రూపాయల పరిశ్రమలు అంతా పచ్చి బోగస్ అని తేలిపోయిందన్నారు ఉండవల్లి అరుణ కుమార్. పరిశ్రమల స్థాపనకు సంబంధించి తాను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మెన్ బుగ్గన రాజేంద్రనాధ్ ను అడిగానని, అంతకుముందు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన సహచరుడు అల్లు బాబీకి కొన్ని పత్రాలు పంపారని ఉండవల్లి తెలిపారు. వాటి ప్రకారం చూస్తే రాష్ట్రంలో అగ్రభాగాన వుండే తూర్పు గోదావరి జిల్లాలో గ్రౌండ్ అయిన పరిశ్రమలు 7 శాతం లేవన్నారు. తనకు నేరుగా సమాధానం చెప్పడం ఇష్టం లేకపోతే ప్రజల్లో వున్న అనుమానాలు నివృత్తి చేసేందుకు తక్షణం శ్వేత పత్రం విడుదల చేయాలనీ ఉండవల్లి మరోసారి డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిజంగా జవాబుదారీ తనం వహించి నిజాలు ప్రజలతో పంచుకుంటే తనకు మీడియా ముందుకు రావలిసిన పనే లేదన్నారు ఉండవల్లి.

Similar News