ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల సిఫ్ సంస్థతో కుదుర్చుకున్న ఎంఓయూ పై రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం ఆయన రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడుతూ... జీరో బడ్జెట్ తో నేచురల్ ఫార్మింగ్ అని ఇటీవల ప్రసంగించిన చంద్రబాబు నాయుడు... అదే నాచురల్ ఫార్మింగ్ కోసం రూ.16,600 కోట్లతో ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారని, అసలు జీరో బడ్జెట్ వ్యవసాయానికి ఇంత పెద్దమొత్తంతో ఎంఓయూ చేసుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై ఓ ఎన్జీఓ సంస్థ సంచలన కథనాన్ని ప్రచురించిందని, ఈ ఎంఓయూ కి సంబంధించి ఆర్టీఐ కింద దరఖాస్తు చేసినా వివరాలు బయటకు రానివ్వడం లేదని ఆయన ఆరోపించారు. నాచురల్ ఫార్మింగ్ కోసం ప్రభుత్వం ఆవుపేడ మరగబెట్టడానికి డ్రమ్ములు ఇచ్చిందని, ఈ డ్రమ్ముల విలువ మార్కెట్ లో నాలుగు వందలైతే ప్రభుత్వం నాలుగు వేలుగా చూపించిందని ఆయన పేర్కొన్నారు. ఇక యూఎన్ఓలో చంద్రబాబు ప్రసంగించారని చెబుతున్న ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రభుత్వ పోర్టల్ లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. రామోజీరావు శిక్షలకు అతీతుడు అనే పద్ధతిలో అందరూ వ్యవహరిస్తున్నారని, ఇది దారుణమన్నారు. రామోజీ మార్గదర్శ వ్యవహారం గురించి రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి తన ఆత్మకథలో రాసుకున్నారని గుర్తు చేశారు.