క్రెడిట్ కార్డుతో ఈ పొరపాట్లు చేస్తున్నారా? తీవ్రంగా నష్టపోతారు!
ఇండియాలో క్రెడిట్ కార్డులు వాడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. గతంలో కార్డు జారీ చేయాలంటే ఎంతో ప్రాసెస్..
ఇండియాలో క్రెడిట్ కార్డులు వాడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. గతంలో కార్డు జారీ చేయాలంటే ఎంతో ప్రాసెస్ ఉండేది. కానీ ఇప్పుడు అలాంటిదేమి ఉండకుండా సులభంగా కార్డును జారీ చేస్తున్నాయి బ్యాంకులు. మరి క్రెడిట్ కార్డ్ రాగానే ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు చేశారంటే అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. కార్డు వాడకం కూడా తెలిసి ఉండాలి. ఇస్టానుసారంగా వాడి సమయానికి డబ్బులు చెల్లించకుంటే బ్యాంకులు వేసే పెనాల్టీ ఛార్జీలు దారుణంగా ఉంటాయి. దీంతో అప్పుల్లో కూరుకుపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే క్రెడిట్ కార్డులు వాడే వారు జాగ్రత్తలు పాటించాలని ఆర్థిక నిపుణులు పదేపదే సూచిస్తున్నారు. ఇక గడువులోగా బిల్లు చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ తగ్గిపోయే అవకాశం ఉంది. మీరు భవిష్యత్తులో రుణాలు తీసుకునే సమయంలో ఆ ప్రభావం చూపే ప్రమాదం ఉంది. క్రెడిట్ స్కోర్ తగ్గిపోతే ఏ బ్యాంకు నుంచి కూడా రుణం అందే అవకాశం ఉండదు. దీంతో సమయానికి బిల్లు చెల్లిస్తూ సరిగ్గా వాడుకుంటే రుణాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇలాంటి వారు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే.
లోన్ కావాల్సి సిబిల్ స్కోర్ తప్పనిసరి:
రుణాలు తీసుకున్న వారు, క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నవారి క్రెడిట్ స్కోర్ అనేది చాలా ముఖ్యం. క్రెడిట్ స్కోర్ అనేది రుణగ్రహిత క్రెడిట్ విలువను సూచిస్తుంది. రుణాలుతీసుకున్న వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా క్రెడిట్ బ్యూరోలు క్రెడిట్ స్కోర్ అందిస్తాయి. క్రెడిట్ స్కోరు ఎక్కువగా ఉంటే, భవిష్యత్తులో తక్కువ రేట్లతో రుణం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
సిబిల్ స్కోర్ను ఏ అంశాలు ప్రభావితం అవుతాయి?
మీ క్రెడిట్ స్కోర్ను ప్రభావితం చేసే అంశాల గురించి జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం. రుణం లేదా క్రెడిట్ కార్డ్ బకాయిలు సమయానికి చెల్లించకపోతే మీ క్రెడిట్ స్కోర్ను ప్రభావితం చేస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ, మీ స్కోర్ను ప్రభావితం చేసే అనేక ఇతర అంశాలు ఉన్నాయి. వాటిపై అందరికీ అవగాహన తక్కువగా ఉంటుంది. అవి ఏంటంటే.. వేరొకరి రుణానికి మీరు హామీ ఇవ్వడం, మీ రుణాన్ని పునర్నిర్మించడం వంటివి.
మినిమమ్ బిల్లు చెల్లిస్తూ పోతున్నారా? ప్రమాదమే
కార్డు బిల్లు వచ్చిన తర్వాత పూర్తిగా చెల్లిస్తే మంచిది. లేకపోతే మినిమమ్ బిల్లు చెల్లించాలని సూచిస్తుంటాయి బ్యాంకులు. అలా పూర్తి బిల్లు చెల్లించకుండా కేవలం మినిమమ్ బిల్లు చెల్లిస్తే కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది. దీని వల్ల మీకు వడ్డీ, జీఎస్టీ, ఇతర ఛార్జీలు విధిస్తుంటాయి బ్యాంకులు. ఇలా మినిమమ్ బిల్లు జోలికి వెళ్లకుండా పూర్తి బిల్లు చెల్లిస్తేనే మంచిది. అలాగే అంతేకాకుండా కుటుంబ సభ్యులకు, బంధువులకు హామీదారుగా ఉండటం సర్వ సాధారణం. అయితే ఇలా తరచుగా చేయడం వలన తమ క్రెడిట్ స్కోర్పై ప్రభావం పడుతుందనే విషయం చాలా మందికి తెలిసి ఉండదు. ఒక వేళ కొందరికి తెలిసినా పెద్దగా పట్టించుకోరు. అలాంటి వారికి భవిష్యత్తులో రుణాల విషయంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇలా చేస్తే కొత్త రుణాల కోసం మీ సొంత అర్హత తగ్గడమే కాదు, అసలు రుణగ్రహీతకు బకాయిలు ఉన్నట్లయితే మీరు కూడా నష్టపోవచ్చు. ఎంత మొత్తం ఖర్చు చేసినా.. సమయానికి బిల్లు చెల్లిస్తే బెటర్.