తూర్పు గోదావరి జిల్లాలోకి ఎంట్రన్స్ అదరగొట్టిన వైసిపి చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర కు మళ్ళీ ఆ స్థాయిలో అనపర్తి నియోజకవర్గంలో అద్భుత స్వాగతం లభించింది. ఒక పక్క వర్షాలతో వాతావరణం సహకరించకపోయినా వైసిపి చీఫ్ వెంట వెల్లువలా వచ్చి చేరారు అనపర్తి నియోజకవర్గంలో జగన్ అభిమానులు. జనప్రవాహంతో గొల్లలమామిడాడ మొత్తం జగన్ జగన్ అంటూ నినాదాలతో హోరెత్తిపోయింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని గొల్లలమామిడాడ కు జననీరాజనంతో చేరుకున్నారు జగన్. పచ్చని పొలాల నడుమ జగన్ ప్రజా సంకల్ప యాత్ర సాగిన తీరుపై డ్రోన్ కెమెరా తో చిత్రీకరించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియా లో మరోసారి వైరల్ అయ్యాయి. దాంతో అటు పార్టీ శ్రేణులు ఇటు నేతలు పూర్తి ఖుషి ఖుషి అయ్యారు. అనపర్తి వైసిపి కో ఆర్డినేటర్ డా . సత్తి సూర్యనారాయణ రెడ్డి ఏర్పాట్ల పట్ల ఆ పార్టీ శ్రేణులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
ఆలస్యంగా సాగుతున్న జగన్ పాదయాత్ర ...
వాస్తవానికి జగన్ ప్రజా సంకల్ప యాత్ర ఈనెల 24 కి తూర్పుగోదావరి జిల్లా దాటి విశాఖ జిల్లాకు అడుగుపెట్టాలిసి వుంది. ఇప్పటివరకు జగన్ రాజమండ్రి, రాజమండ్రి రూరల్, కొత్తపేట, పి గన్నవరం, రాజోలు, అమలాపురం, రామచంద్రపురం, మండపేట, నియోజకవర్గాల మీదుగా తన యాత్ర ముగించారు. ఇంకా అనపర్తి, పెద్దాపురం, కాకినాడ, కాకినాడ రూరల్, పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో పర్యటన చేయాలిసి వుంది. వీటిని వచ్చే పదిరోజుల్లో పూర్తి చేయడం అయ్యేపనికాదు. ఆగస్టు నాటికే వైసిపి చీఫ్ విశాఖ జిల్లా చేరుకునే పరిస్థితే ఉందంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. భారీ వర్షాలు, కోర్టుకు ప్రతి వారం హాజరుకావడం వంటి కారణాలతో జగన్ యాత్ర అనివార్యంగా ఆలస్యం గా సాగుతుంది.