వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుల రాజీనామాలను ఆమోదించక తప్పదా? స్పీకర్ సుమిత్రా మహాజన్ మరికొంత సమయం తీసుకుంటున్నారా? అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. నిన్న వైసీపీ ఎంపీలతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సమావేశమయ్యారు. ఐదుగురు ఎంపీలతో సుమిత్ర గంట సేపు మాట్లాడారు. భావోద్వేగంతో రాజీనామాలు చేయడం తగదని, ప్రజలు ఎన్నుకున్నప్పుడు పూర్తి కాలం కొనసాగడమే మేలని సుమిత్రా మహాజన్ ఐదుగురు ఎంపీలకు చెప్పినట్లు తెలుస్తోంది.
పునరాలోచించుకోవాలని.....
అయితే తాము భావోద్వేగంతో చేసినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అత్యవసరమని, ప్రజల్లో సెంటిమెంట్ బలంగా ఉందని, తమ రాజీనామాలను ఆమోదించమని ఎంపీలు పదే పదే కోరారు. అయినా ఒకసారి ఆలోచించుకోవాలని సుమిత్రా మహాజన్ కోరారు. తాము ఆలోచించుకునేదేమీ లేదని, తమ రాజీనామాలను ఆమోదించి ప్రజల్లోకి వెళ్లేందుకు తమను అనుమతించాలని సుమిత్రామహాజన్ ను ఎంపీలు కోరారు.
వచ్చే నెల 5వ తేదీ తర్వాత......
కర్ణాటక ఎంపీల రాజీనామాలను తక్షణమే ఆమోదించి, తమ రాజీనామాలను ఆమోదించకపోవడాన్ని కూడా వారు స్పీకర్ ను ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే అందుకు స్పీకర్ అక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచి ఎంపీ పదవులకు రాజీనామాలు చేశారని, కాని ఇక్కడ పరిస్థితులు వేరని ఆమె వివరించారు. అయితే సుమిత్రా మహాజన్ మరికొంత సమయం తీసుకున్నారు. మరోసారి వైసీపీ ఎంపీలతో సమావేశం కావాలని నిర్ణయించారు. వచ్చే నెల 5వ తేదీ తర్వాత మరోసారి ఎంపీలతో భేటీ అవుతానని, అప్పటికీ వారి ఆలోచనల్లో మార్పు రాకుంటే రాజీనామాలను ఆమోదించక తప్పదని సుమిత్ర మహాజన్ చెప్పారు. వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందడానికి మరో వారం సమయం పట్టే అవకాశముంది.