Women's Day : అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు మొదలైంది ? ఎందుకు జరుపుకుంటాం ?
మహిళా దినోత్సవానికి 1908లోనే బీజాలు పడ్డాయి. మహిళలకు తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతిఏడాది మార్చి 8వ తేదీన జరుపుకుంటాం. ఈ రోజున మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు సెలవు ఇస్తారు. ఆయా రంగాల్లో రాణిస్తున్న మహిళలను ప్రత్యేకంగా సన్మానిస్తారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. అంతా బాగానే ఉంది. అసలు మహిళా దినోత్సవం ఎప్పుడు మొదలైంది. ఎందుకు జరుపుకుంటాం అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నెట్టింట్లో లభించిన సమాచారం ప్రకారం.. దాదాపు శతాబ్ద కాలానిపైగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఒక కార్మిక ఉద్యమం నుంచి ఇది పుట్టుకొచ్చింది. ఐక్యరాజ్య సమితి దీనిని అధికారికంగా గుర్తించి ప్రతి ఏటా మార్చి 8న మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. మహిళా దినోత్సవానికి 1908లోనే బీజాలు పడ్డాయి. మహిళలకు తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. వారి డిమాండ్ల దృష్ట్యా అమెరికాలోని సోషలిస్టుపార్టీ 1909వ సంవత్సరంలో ఫిబ్రవరి 28న జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. జాతీయ మహిళా దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని క్లారా జెట్కిన్ అనే మహిళ ఆలోచించారు. కోపెన్‌హెగెన్ నగరంలో 1910లో జరిగిన 'ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్' సదస్సులో ఆమె ఈ ప్రతిపాదన చేశారు. 17 దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు.