Fri Nov 22 2024 22:49:08 GMT+0000 (Coordinated Universal Time)
Ap Budget : బుగ్గన బడ్జెట్ అలరించేదెవరిని?
ఎన్నికలకు ముందు ఇదే పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో జగన్ ప్రభుత్వం సంక్షేమంపైనే దృష్టి సారించింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ ను రేపు సభలో ప్రవేశపెట్టనుంది. ఎన్నికలకు ముందు ఇదే పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో జగన్ ప్రభుత్వం సంక్షేమంపైనే దృష్టి సారించింది. సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మరో ఏడాదిన్నర పాటు సంక్షేమ పథకాలను చెప్పిన తేదీకి అమలు చేయాల్సి ఉంది. మరో వైపు పెరిగిన అప్పులతో ఇబ్బందులు తప్పవని తెలుసు. దీంతో పాటు ఎన్నికల ఏడాది కావడంతో ప్రజలపై భారం మోపేందుకు కూడా జగన్ ప్రభుత్వానికి అవకాశం లేదు.
ప్రజలపై భారం మోపకుండా...
ఈ నేపథ్యంలో ప్రజలపై భారం మోపకుండా కేవలం అప్పులతోనే మరో ఏడాదిన్నర నెట్టుకు రావాల్సి ఉంది. మొత్తం 2.60 లక్షల కోట్ల మేర బడ్జెట్ ను సభలో రేపు బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ప్రవేశపెట్టబోతున్నారు. ఇందుకు సంబంధించి జగన్ సలహాలు, సూచనలతో బడ్జెట్ ను అధికారులు పూర్తి చేశారు. సంక్షేమ పథకాలకు ఏమాత్రం నిధులు ఈ బడ్జెట్ లోనూ తగ్గవు. పైగా వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతుండటంతో కొత్త పథకాల రూపకల్పనలో జగన్ ఉన్నారు. ఈ కొత్త పథకాల ప్రస్తావన బడ్జెట్ లో ఉండకపోయినా దానిని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ను రూపొందించాల్సి ఉంటుంది.
ప్రభుత్వోద్యోగులు...
మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే ఆందోళన బాట పట్టారు. సకాలంలో జీతాల చెల్లింపు మాత్రమే కాకుండా వారి డిమాండ్లు తీర్చడానికి వేల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయి. ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులను కూడా సంతృప్తి పర్చడం జగన్ ప్రభుత్వానికి అవసరం కూడా. కానీ ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితుల్లో వారి డిమాండ్లన్నీ నెరవేర్చేటంత నిధులు మాత్రం ఖజానా లేవన్నది వాస్తవం. మరి జగన్ ప్రభుత్వం ఈ సమస్య నుంచి ఎలా బయటపడతారన్నది చూడాల్సి ఉంది. ఉద్యోగులు మాత్రం ఎన్నికల సంవత్సరం కాబట్టి వెనక్కు తగ్గే అవకాశముండదు. ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చి ఆందోళన బాటపట్టిన ఉద్యోగులను సంతృప్తి పర్చడం కత్తిమీద సామే అవుతుంది.
అందరికీ న్యాయం...
జగన ప్రభుత్వం తాము ఎన్నికల మ్యానిఫేస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు పర్చామని చెబుతున్నారు. మద్యపాన నిషేధం మినహాయించి దాదాపు అన్ని హామీలను నెరవేర్చామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరో వైపు పింఛన్ల మొత్తాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి మరో రూ.250లు పెంచాల్సి ఉంటుంది. ఇది కూడా జగన్ హామీలో భాగమే. పింఛన్ బడ్జెట్ కూడా పెరగనుంది. ఇటు వేతనాలు, అటు పింఛను ప్రస్తుతమున్న ఆర్థిక పరస్థితి దృష్ట్యా అందరికీ న్యాయ చేయడం కొంత కష్టమైన పనే. కానీ తప్పదు. ఎన్నికల్లో గెలవాలంటే అందరినీ తృప్తి పర్చాల్సిందే. ఈ ఏడాదిన్నర కీలకం కావడంతో బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి తన బడ్జెట్ లో ఎలాంటి మ్యాజిక్లు చేయనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story