Mon Dec 23 2024 02:42:00 GMT+0000 (Coordinated Universal Time)
Ap Budget : బడ్జెట్లో ఈ రెండు కీలకమే
జగన్ ప్రభుత్వం రేపు చివరిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ లో రెండు అంశాలు కీలకంగా మారనున్నాయి
ఎన్నికల వేళ జగన్ ప్రభుత్వం రేపు చివరిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ లో రెండు అంశాలు ప్రభుత్వానికి కీలకంగా మారనున్నాయి. ఒకటి సాగునీటి ప్రాజెక్టులు కాగా, రెండు ఉపాధి అవకాశాలు. ఈ రెండింటికీ సరిగా నిధులు కేటాయించకుండా మ..మ అనిపిస్తే వచ్చే ఎన్నికల్లో రెండు ప్రధాన వర్గాలు దూరమవుతాయన్న భావన విశ్లేషకుల్లో వ్యక్తమవుతుంది. ప్రధానంగా ఏపీ వ్యవసాయరంగం మీద ఆధారపడి ఉంది. రైతులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. రైతుల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టినా సాగునీటిని అందించడం ద్వారానే ప్రభుత్వంపై అన్నదాతల్లో నమ్మకం పెరుగుతుంది.
పోలవరం ప్రాజెక్టు...
ఇప్పటికే ప్రధానమైన పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు. అది ఎప్పటికి పూర్తవుతుందో కూడా తెలియని పరిస్థితి. చంద్రబాబు మీద నెపం నెట్టేందుకు యత్నించినా రైతులు అందుకు అంగీకరించకపోవచ్చు. గత ఎన్నికలలో చంద్రబాబు ఓటమికి ప్రధాన కారణం పోలవరాన్ని పూర్తి చేయకపోవడమే అని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడ జగన్ కు కూడా పోలవరం శాపంగా మారకూడదనుకుంటే బడ్జెట్లో ప్రాజెక్టుకు అత్యధిక నిధులు కేటాయించి పూర్తి చేయాల్సి ఉంటుంది. జాతీయ ప్రాజెక్టు అయినా, కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాల్సి ఉన్నా, ఢిల్లీ నుంచి నిధులు సక్రమంగా రాలేదని చెప్పడం మాత్రం సాకులుగానే చూస్తారు తప్ప, రైతులలో నెలకొన్న అసంతృప్తికి ఫుల్ స్టాప్ పడదన్నది వాస్తవం.
కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు...
అందుకే పోలవరానికి అత్యధిక నిధులు కేటాయించి వీలయినంత త్వరగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయగలిగితేనే జగన్ ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడుతుంది. ఇక వెలిగొండ ప్రాజెక్టు కూడా అంతే. నిధుల లేమితో కాంట్రాక్టర్లకు సక్రమంగా బిల్లులు చెల్లించకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. అన్ని రకాల పనులకు కాంట్రాక్టర్లకు దాదాపు లక్ష కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉండటంతో వారు వేగంగా పనులు పూర్తి చేయాలంటే ప్రభుత్వం బిల్లులు చెల్లించడం తప్పనిసరి. ఇక వెలిగొండ ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామని జగన్ ఇచ్చిన హామీ నెరవేరాలంటే ఈ బడ్జెట్ నిధులను కేటాయించక తప్పదు. మరి జగన్ ప్రభుత్వం ప్రయారిటీ ఈ బడ్జెట్ లో ఎలా ఉంటుందన్నది చూడాల్సి ఉంది.
యువత కోసం...
ఇక మరో ముఖ్యమైన అంశం ఉపాధి అవకాశాలు. జగన్ ప్రభుత్వం వచ్చిన నాలుగేళ్లలో వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులను నియమకాలు జరిపినప్పటికీ పెద్దయెత్తున ప్రభుత్వ నియామకాలు చేపట్టలేదు. డీఎస్సీ ఊసే లేదు. వచ్చే ఎన్నికల్లో యువత కీలకంగా మారనుంది. జాబ్ క్యాలెండర్ పై కూడా స్పష్టత లేదు. దీంతో లక్షల సంఖ్యలో యువత పొరుగు రాష్ట్రం వైపు చూస్తున్నారు. సంక్షేమంపైనే జగన్ సర్కార్ దృష్టి పెట్టింది తప్ప అభివృద్ధి, ఉపాధి అవకాశాలు లేవన్న విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో రేపటి బడ్జెట్ లో జగన్ ప్రభుత్వం ఏ మేరకు ప్రకటన చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
- Tags
- jagan government
Next Story