Mon Dec 23 2024 02:27:44 GMT+0000 (Coordinated Universal Time)
ap budget : ఓటు బ్యాంకుకు వేల కోట్లు.. కాపులకు పెద్దపీట
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కాపు సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇచ్చింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కాపు సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇచ్చింది. కాపు సంక్షేమానికి ఈ బడ్జెట్ లో 4,887 కోట్ల రూపాయలను కేటాయించింది. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతుండటం, కాపు సామాజికవర్గం ఓట్లు కీలకం కావడంతో అత్యధిక నిధులను కాపు సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయించిందని చెప్పాలి. ఏపీలో అత్యధిక జనాభా ఉన్న కాపులు, బీసీలకు ఈ బడ్జెట్ లో ప్రాధాన్యత కల్పించింది. ఇప్పటికే కాపు సామాజికవర్గం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎగరేసుకు పోతారన్న ప్రచారంతో భారీగా నిధులను ప్రభుత్వం కేటాయించిందన్న విశ్లేషణలు వినపడుతున్నాయి.
కాపులకోసం...
సంక్షేమ పథకాలను అమలు పరుస్తూనే సామాజికవర్గాల వారీగా కూడా ప్రభుత్వం బడ్జెట్ లో నిధులను కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు కాపు సంక్షేమానికి అత్యధిక నిధులు కేటాయించింది. షెడ్యూలు కులాల సంక్షేమం కోసం రూ.20,005 కోట్లు కేటాయించింది. షెడ్యూల్ తెగల సంక్షేమానికి రూ.6,929 కోట్లు రూపాయలు, బీసీల సంక్షేమం కోసం రూ.38,605 కోట్లు రూపాయలను ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయించింది.
సామాజికవర్గాల వారీగా...
మైనార్టీల సంక్షేమం రూ.4,203 కోట్లను కేటాయించింది. ఎన్నికలకు ముందు ఇదే పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో అత్యధిక శాతం నిధులను అధికార పార్టీ తమకు అండగా నిలచే సామాజికవర్గాలకు కేటాయించింది. ఓటు బ్యాంకు కోసం కోట్ల రూపాయలను కేటాయించిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, కాపుల సంక్షేమం కోసం వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించడం విశేషం.
Next Story