Tue Nov 05 2024 16:43:01 GMT+0000 (Coordinated Universal Time)
లెక్క తప్పితే?
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో సానుభూతి వస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు
రాజకీయం ఎప్పుడూ ఒకలా ఉండదు. అధికారంలో ఉన్న వాళ్లం తామే మొనగాళ్లమని భావిస్తే ప్రజలు తగిన సమయంలో సరైన తీర్పు చెబుతారు. అదీ ఎన్నికలు సమీపించే సమయంలో తీసుకునే నిర్ణయాలు అన్ని కోణాల్లో ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది. ఏ మాత్రం ఆవేశపూరిత చర్యలకు దిగినా దాని ఫలితాన్ని భవిష్యత్ లో చవి చూడక తప్పదు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కయినా.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. ప్రస్తుతం గత నలభై ఎనిమిది గంటల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే అది చంద్రబాబు అరెస్ట్ మాత్రమే. ఈ అరెస్ట్ తో చంద్రబాబుకు సానుభూతి కావాల్సినంత లభిస్తుందన్నది టీడీపీ నేతలు విశ్వసిస్తున్నారు. అంత సీనులేదని వైసీపీ వర్గాలు అంటున్నాయి.
లోపల భయమే...
వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల్లో చంద్రబాబు అరెస్ట్ భయం పట్టుకుంది. వారిపైకి విమర్శలు చేస్తున్నప్పటికీ లోలోపల మాత్రం వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభావం తమ గెలుపుపై ఏ మేరకు ప్రభావం చూపుతుందోనన్న టెన్షన్ ప్రతి ఒక్క ఎమ్మెల్యేలోనూ ఉంది. ఇప్పటికే చంద్రబాబు వయసు, అనుభవం రీత్యా తనకు చివరి ఛాన్స్ ఇవ్వాలంటూ ఆయన గత కొన్నాళ్ల నుంచి జనంలోనే ఉన్నారు. వివిధ కార్యక్రమాలతో ప్రజలను తన వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జనంలోనే ఉన్న చంద్రబాబును నంద్యాలలో అరెస్ట్ చేయడం సానుభూతి ఎక్కువగా వస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఈ వయసులో ఆయనను అరెస్ట్ చేయడాన్ని ప్రతి ఒక్కరూ తప్పు పడుతున్నారన్నది టీడీపీ నేతల అభిప్రాయంగా వినిపిస్తుంది.
ఎన్నికల సమయంలోనే…
అయితే కొందరు విశ్లేషకులు మాత్రం ఈ వాదనను అంగీకరించడం లేదు. ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల సమయం ఉంది. ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. జనం మనసులో నుంచి తొలగిపోతుంటాయి. అంతే తప్ప ఎన్నికల సమయంలో ఒకే అంశాన్ని మనసులో పెట్టుకుని ఓటు వేయరన్నది కొందరి వాదన. ఇందుకు గతంలో జరిగిన కొన్ని సంఘటనలను కూడా వారు ఉదహరిస్తున్నారు. సానుభూతి వస్తుందా? రాదా? అన్నది పోలింగ్ రోజు ఉండే జనం మూడ్ ను బట్టి తేలుతుందన్నది మరికొందరి అభిప్రాయం. చంద్రబాబును అరెస్ట్ చేసినా పెద్దగా జనం నుంచి రియాక్షన్ రాకపోవడాన్ని ఈ సందర్భంగా కొందరు ఉదహరిస్తున్నారు. అంతెందుకు జగన్ పదహారు నెలలు జైలుకెళ్లి వచ్చినా 2014 ఎన్నికల్లో మాత్రం సానుభూతి వర్క్ అవుట్ కాలేదు. ఎక్కువ స్థానాలయితే సాధించగలిగారు కానీ అధికారాన్ని జగన్ అందుకోలేకపోయారు. ఈ విషయాన్ని కూడా గమనించాల్సిన అంశమే. తర్వాత 2019 ఎన్నికలకు ముందు సుదీర్ఘ పాదయాత్ర చేసి వైసీపీని జగన్ అధికారంలోకి తేగలిగారు.
గతంలోనూ…
చంద్రబాబు నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు అరెస్ట్ కాలేదు. 2010లో చంద్రబాబు అరెస్టయినా అది బాబ్లీ ప్రాజెక్టు పైకి దూసుకెళ్లిన కేసు మాత్రమే. అప్పట్లో మహారాష్ట్ర పోలీసులు చంద్రబాబు అరెస్టయినా వెను వెంటనే జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ గెలవలేకపోయింది. తెలంగాణ సమస్యలపై పోరాడి అరెస్టయినా ప్రజలు మాత్రం చంద్రబాబు పార్టీని ఆదరించలేదు. అలాగే 2003లో చంద్రబాబుపై అలిపిరిలో మావోయిస్టులు దాడి చేశారు. దీంతో సానుభూతి వస్తుందని ఆశించి ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు కూడా చంద్రబాబు అరెస్ట్ వైసీపీ గెలుపోటములపై ప్రభావం చూపబోదన్న ఒపీనియన్ కూడా గట్టిగానే వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఏ ఏ అంశాలు ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడే నిర్ణయించలేమన్నది కూడా మరికొందరి అభిప్రాయం. మొత్తం మీద చంద్రబాబు అరెస్ట్ టీడీపీకి పుష్కలంగా ఓట్లు వచ్చి పడతాయని చెప్పలేం. అలా అని కాదని అనలేని పరిస్థితి ఉండవచ్చు. ఏది ఏమైనా ఏపీ రాజకీయాలు మాత్రం ఇకపై మరింత హాట్ హాట్ గా సాగనున్నాయి.
Next Story