Sun Dec 22 2024 14:40:41 GMT+0000 (Coordinated Universal Time)
మూడు వారాలు వాయిదా
సుప్రీంకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు కేసు విచారణ జరిగింది
సుప్రీంకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు కేసు విచారణ జరిగింది. అయితే ఈ కేసును వాదిస్తున్న సిద్దార్థ లూథ్రా చంద్రబాబుకు సంబంధించిన కేసులో విజయవాడలో ఉండటంతో ఆయన హాజరు కాలేదు. దీంతో విచారణను వాయిదా వేయాలని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టును కోరారు. దీంతో దీనిపై తదుపరి విచారణను మూడు వారాలకు సుప్రీీంకోర్టు వాయిదా వేసింది.
హైకోర్టు తీర్పుపై...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ 8గా ఉన్న అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. అయితే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ వైఎస్ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
బెయిల్ రద్దు చేయాలంటూ...
తన తండ్రి హత్యలో ప్రధాన సూత్రధారిగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి దర్యాప్తునకు సహకరించకుండా తప్పించుకుంటున్నారని, ఆయన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని కోరారు. కేవలం రాజకీయ వైరంతోనే ఈ హత్య జరిగిందని ఆమె తన పిటీషన్ లో పేర్కొన్నారు. అయితే ఈరోజు విచారణకు సిద్ధార్థ లూథ్రా అందుబాటులో లేకపోవడంతో కేసును మరో మూడు వారాల పాటు వాయిదా వేసింది.
Next Story