Mon Dec 23 2024 02:16:51 GMT+0000 (Coordinated Universal Time)
వరస పిటీషన్లు.. న్యాయమూర్తి అసహనం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు న్యాయవాదులు వరస పిటీషన్లు వేస్తున్నారు. ఏసీబీ న్యాయస్థానంలో ఈ పిటీషన్లు దాఖలవుతున్నాయి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు న్యాయవాదులు వరస పిటీషన్లు వేస్తున్నారు. ఏసీబీ న్యాయస్థానంలో ఈ పిటీషన్లు దాఖలవుతున్నాయి. స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో అన్ని పత్రాలను పరిశీలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మరొక పిటీషన్ ను చంద్రబాబు తరుపున న్యాయవాదులు దాఖలు చేశారు. సీఐడీ కార్యాలయంలో ఉన్న పత్రాలను తాము పరిశీలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీఆర్పీసీ 207 కింద పిటీషన్ వేశారు.
ప్రొసీజర్ ప్రకారం...
అయితే వరసగా పిటీషన్లు వేస్తుండటంతో న్యాయమూర్తి కొంత అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వరసగా పిటీషన్లు వేస్తూ న్యాయస్థానం సమయాన్ని వృధా చేస్తారా? అని న్యాయమూర్తి ప్రశ్నించారని సమాచారం. కోర్టు ప్రొసీజర్స్ ఫాలో అవ్వడం లేదంటూ కొంత ఆగ్రహం కూడా న్యాయమూర్తి వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే హౌస్ అరెస్ట్ కింద రిమాండ్ విధించాలని వేసిన పిటీషన్ పై తీర్పు ఇచ్చే సమయంలో ఇలా పిటీషన్లు వేయడమేంటని, మధ్యాహ్నం 12 గంటలలోపే పిటీషన్లు ఏవైనా వేయాలని, నెంబర్లు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం.
పెండింగ్ కేసులు ఎలా?
వేరే కేసులు పెండింగ్ లో ఉన్నాయని ఈ సందర్భంగా న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. డైరెక్ట్ గా పిటీషన్ లు వేసి విచారించడం సబబు కాదని హితవు పలికారు. ఆర్డర్లు ఇచ్చే సమయానికి కొత్త పిటీషన్లు వేస్తే పెండింగ్ లో ఉన్న పిటీషన్లు ఎలా పరిష్కరిస్తామని కొంత చిరాకు పడినట్లు తెలిసింది. అయితే తమ క్లయింట్ కు ఎలాంటి అన్యాయం జరగకూడదన్న ఉద్దేశ్యంతోనే తాము పిటీషన్లు వేస్తున్నామని వారు న్యాయమూర్తికి వివరణ ఇచ్చుకున్నట్లు తెలిసింది.
Next Story