Mon Dec 23 2024 01:37:07 GMT+0000 (Coordinated Universal Time)
ఫస్ట్ డే అసహనంగానే
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తొలి రోజంతా జైలులో అసహనంగా గడిపినట్లు తెలిసింది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తొలి రోజంతా జైలులో అసహనంగా గడిపినట్లు తెలిసింది. అయితే సాయంత్రం వరకూ గదికే పరిమితమయినప్పటికీ తర్వాత బయటకు వచ్చి జైలు అధికారులతో కలసి చంద్రబాబు జైలులో ఉన్న స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్ ను చూశారు. అదే కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈరోజు బెయిల్ వస్తుందని భావించినా ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరుపున న్యాయవాదులు వేసిన హౌస్ కస్టడీ పిటీషన్ ను విచారించిన ఏసీబీ న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం దీనిపై తీర్పు చెబుతామని న్యాయమూర్తి చెప్పడంతో చంద్రబాబు తరుపున న్యాయవాదులు మాత్రం రేపు ఉదయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ముభావంగానే...
అయితే జైలులో ఉన్న చంద్రబాబును నేడు ఎవరూ కలవలేదు. కొంత ముభావంగానే ఉన్నారు. తొలుత ఆయన భార్య, కుమారుడు, కోడలు ములాఖత్ అవుతారని భావించినా రేపటికి వాయిదా వేసుకున్నారు. రాజమండ్రిలో ఒక టీడీపీ నేత ఇంట్లో చంద్రబాబు కుక్ వండిన ఆహారాన్ని జైలుకు తీసుకు వచ్చారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఆయన కొన్ని న్యూస్ పేపర్లను, మ్యాగజైన్లను కోరారు. జైలు అధికారులు అందుకు సమ్మతించి కొన్ని న్యూస్ పేపర్లను చంద్రబాబుకు అందించినట్లు తెలిసింది.
అందరూ అక్కడే...
రాజమండ్రి సెంట్రల్ జైలులోనే చంద్రబాబు ఉండటంతో తెలుగుదేశం పార్టీ నేతలందరూ అక్కడే మకాం వేసి ఉన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ సీనియర్ నేతలు సమావేశమై రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. చంద్రబాబు హౌస్ కస్టడీ పిటీషన్ పై నేడు తీర్పు రానుండటంతో ఆ తీర్పు తమకు ప్రతికూలంగా వస్తే ఏం చేయాలన్న దానిపై చర్చలు జరిపినట్లు తెలిసింది. కేంద్ర కార్యాలయం నుంచే చంద్రబాబు న్యాయవాదులతో చర్చించారు. మరోవైపు సీఐడీ కూడా తమకు ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పిటీషన్ వేసింది. దీనిపై కూడా రేపు వాదనలు వినే అవకాశముందంటున్నారు.
రేపు యాక్షన్ ప్లాన్...
చంద్రబాబు తొలిసారి జైలుకు వెళ్లడంతో పార్టీ శ్రేణులన్నీ డీలా పడ్డాయి. ఏడు పదులు దాటిన తమ అధినేతను జైలులో పెట్టడం అమానుషమని వైసీపీ నేతలు అంటున్నారు. భవిష్యత్ కార్యాచరణ ఎలా రూపొందించాలన్న దానిపై సీరియస్ గా చర్చలు జరుపుతున్నారు. ఈరోజు బంద్ సక్సెస్ అయిందని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే కేంద్ర కార్యాలయానికి అందిన సమాచారం మేరకు అనేక మంది నేతలు హౌస్ అరెస్ట్ కావడంతో పోలీసులు కార్యకర్తలను, నేతలను బయటకు రాకుండా అడ్డుకోగలిగారని చెబుతున్నారు. రేపు మరో యాక్షన్ ప్లాన్ ను టీడీపీ ప్రకటించే అవకాశముంది.
Next Story