Sun Dec 22 2024 17:33:38 GMT+0000 (Coordinated Universal Time)
నేను వస్తున్నా రెడీగా ఉండండి : బాలకృష్ణ
చంద్రబాబును జైల్లో పెట్టాలనే అక్రమ కేసులన్నీ బయటకు తీస్తున్నారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు
చంద్రబాబును జైల్లో పెట్టాలనే అక్రమ కేసులన్నీ బయటకు తీస్తున్నారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. కావాలనే స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ అంటూ గగ్గోలు పెడుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. ప్రజలే వారికి బుద్ధి చెబుతారన్నారు. స్కిల్ డెవలెప్మెంట్ కేసులో అప్పటి అధికారి ప్రేమ్ చంద్రారెడ్డి పేరు ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. దాదాపు రెండున్నర లక్షల మందికి నైపుణ్యంలో శిక్షణ ఇచ్చారన్నారు. అందరూ ప్రశంసించిన స్కీమ్ ను స్కామ్ అంటూ తప్పుడు కేసులు నమోదు చేసి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారన్నారు.
కడిగిన ముత్యంలా...
స్కిల్ డెవలెప్మెంట్ స్కీం గుజరాత్ లోనూ అమలు చేశారన్నారు. ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు మొదట ఎందుకు చేర్చలేదని ఆయన ప్రశ్నించారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికి వదిలేసి ప్రతిపక్షాలపై జగన్ ప్రభుత్వం పడిందని ఫైర్ అయ్యారు. సంక్షోభాలకు టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో భయపడబోదన్నారు. ఇది పార్టీకి అలవాటేనని అని ఆయన తెలిపారు. కడిగిన ముత్యంలా ఈ కేసు నుంచి చంద్రబాబు బయటపడతారని బాలకృష్ణ ఆకాంక్షించారు. టీడీపీ నేతలందరినీ అక్రమ కేసుల్లో నిర్భంధించడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మార్చుకుందన్నారు.
అభివృద్ధి పూర్తిగా...
చంద్రబాబు తన పరిపాలనలో అభివృద్ధి ఏంటో చూపారన్నారు. తెలుగువారిలో ఆయన ఆత్మవిశ్వాసం పెంచారన్నారు. ఎన్టీఆర్ వల్ల తెలుగు వారి ఆత్మగౌరవం మరింత పెరిగిందన్నారు. జగన్ రాకతో ప్రపంచపటంలోనే ఏపీ లేకుండా పోయిందని బాలకృష్ణ అన్నారు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. దేనినైనా సమర్థంగా ఎదుర్కొనే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉందన్నారు. తెలంగాణకు ధీటుగా ఏపీని చంద్రబాబు తీసుకెళితే జగన్ అధికారంలోకి వచ్చి అంతా రివర్స్ చేశాడన్నారు. అందరూ తిరగబడాల్సిన సమయం ఆసన్నమయిందన్నారు. తాను వస్తున్నానని, గెట్ రెడీ అంటూ బాలకృష్ణ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు.
Next Story