Thu Nov 21 2024 23:08:45 GMT+0000 (Coordinated Universal Time)
టెన్షన్.. తీర్పు ఎలా ఉంటుందో?
చంద్రబాబు హౌస్ కస్టడీ పై తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హౌస్ రిమాండ్ పై న్యాయస్థానం తీర్పు నేడు వెలువరించనుంది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హౌస్ కస్టడీ పై తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హౌస్ రిమాండ్ పై సుదీర్ఘంగా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును నేటికి వాయిదా వేసింది. అయితే హౌస్ కస్టడీకి ఇవ్వాలన్న చంద్రబాబు న్యాయవాదుల వాదనను ప్రభుత్వం తరుపున న్యాయవాదులు తిరస్కరించారు. జైలులోనే ఆయనకు పూర్తి భద్రత ఉంటుందని స్పష్టం చేశారు. ఆయనకు ప్రత్యేకంగా గది కేటాయించడంతో పాటు ఇంటి నుంచి భోజనం, మందులు కూడా పంపేందుకు తాము అంగీకరించిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ప్రాణహాని ఉందని..
కానీ జైలులో చంద్రబాబుకు ప్రాణహాని ఉందని ఆయన తరుపున న్యాయవాదులు వాదించారు. ఆయనకు జడ్ ప్లస్ భద్రత కలిగిన నేత అని, 73 ఏళ్ల వయసుతో పాటు బీపీ, షుగర్ వంటి సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. హౌస్ అరెస్ట్ లో ఉంచేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఆయన సాక్షులను ఏమాత్రం ప్రభావితం చేయరని, గతంలో హౌస్ రిమాండ్ కు ఇచ్చిన పలు కేసులను కూడా చంద్రబాబు న్యాయవాదులు ఈ సందర్భంగా ఉదహరించారు.
హైకోర్టులో బెయిల్...
చంద్రబాబు తమ విచారణకు సహకరించలేదని, ఆయనను మరో ఐదు రోజుల పాటు విచారణకు కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ వేసిన పిటీషన్ పై కూడా నేడు విచారణ జరగనుంది. ఈ కుంభకోణానికి సంబంధించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి ఆయనను కస్టడీకి అప్పగించాలని కూడా సీఐడీ తరుపున న్యాయవాదులు కోరారు. మరోవైపు చంద్రబాబు తరుపున న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ పిటీషన్ వేశారు. ఏసీబీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై వారు హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఈ పిటీషన్ పై రేపు విచారణ చేపడతామని తెలిపింది. దీంతో హౌస్ కస్టడీపై తీర్పు ఎలా వస్తుందన్న టెన్షన్ పార్టీ వర్గాల్లో నెలకొంది.
Next Story