Sun Dec 22 2024 17:54:42 GMT+0000 (Coordinated Universal Time)
Ap Politics : ఇమేజ్ ను పెంచడమెలా? ఏపీని చూసి నేర్చుకోండి భయ్యా
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. ఎవరు అధికారంలో ఉంటే స్కీంలు దేశం మొత్తం అనుసరిస్తాయన్న ప్రచారం చేసుకుంటారు
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. ఎవరు అధికారంలో ఉంటే వారి ఆలోచనలు, స్కీంలు దేశం మొత్తం అనుసరిస్తాయన్న ప్రచారం చేసుకుంటారు. అంతా చేసినా ఎన్నికల సమయం వచ్చేసరికి చతికలపడిపోతుంటారు. గత కొన్ని ఎన్నికల్లో జరుగుతున్న తంతు ఇదే కావడంతో ఈ ప్రచారాలను పెద్దగా నమ్మవద్దంటూ రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. మిగిలిన రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ కు భిన్నమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ అధికార పార్టీపై ప్రశంసలు తప్ప. విమర్శలు బహిరంగంగా ఉండవు. అది చంద్రబాబు అయినా, జగన్ అయినా ఒక్కటే. పాలన సూపర్ అంటూ తెగపొగిడేసే బ్యాచ్ ఒకటి సిద్ధంగా ఉంటుంది.
నాడు జగన్ పై ప్రశంసలు...
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాలంటీర్ల వ్యవస్థను, ఫ్యామిలీ డాక్టర్ పథకాలను ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని ఊదరగొట్టారు. ఆర్బీకే సెంటర్లను కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అధ్యయనం చేసి వెళ్లారంటూ వార్తలు హల్ చల్ చేశాయి. ఇక జగన్ అమలుచేసిన సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు చేయాల్సిన పరిస్థితులు రావచ్చంటూ ఊహాగానాలు కూడా పెద్దయెత్తున చెలరేగాయి. జగన్ ఇమేజ్ ను అమాంతం అటు జాతీయ మీడియాతో పాటు పార్టీకి అనుబంధంగా ఉండే ప్రాంతీయ న్యూస్ ఛానెళ్ల దగ్గర నుంచి పత్రికలు వరకూ తెగ పొగడ్తలతో ముంచెత్తాయి.ఇంత చేసిన జగన్ పార్టీ చివరకు మాత్రం11 సీట్లకు మాత్రమే పరిమితమయింది.
చంద్రబాబుపై పొగడ్తలు...
ఇప్పుడు చంద్రబాబుకు కూడా దాదాపు అదే పరిస్థితి జరుగుతుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ప్రతిరోజూ చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తడమే పనిగా పెట్టుకున్నాయి కొన్ని సామాజిక మాధ్యమాలు. జనం అవస్థలు మాత్రం పట్టించుకోకుండా అమరావతి ఇక పూర్తయినట్లేనన్న కథనాలు ప్రచురితమవుతున్నాయి. అదే సమయంలో చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలు దేశం అవలంబిస్తుందని కూడా తెగ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు మిగిలిన రాష్ట్రాల్లో అమలవుతున్నప్పటికీ ఇక్కడ అధ్యయనం చేయడానికి పొరుగు రాష్ట్రాలు వస్తున్నాయంటూ కథనాలు వండి వార్చేస్తున్నారు.
ఎన్నికల సమయానికి...
కానీ ఎన్నికల సమయానికి మాత్రం ఎవరు ఏం చేసినా ఫలితాలు మాత్రం జనం తేలుస్తారు. ఈ పథకాలు, ఈ సంక్షేమం అనేది జనం విశ్వసించరు. వారికి ఏది కావాలో అది తేలుస్తారు. ఏ రాష్ట్రమైనా అంతే. వాగ్దానాలు చేసినా, హామీలు ఇచ్చినా దానిని నమ్మేవారు కొద్ది శాతం మాత్రమే ఉంటారని గత ఎన్నికల ఫలితాలను బట్టి అర్థమవుతుంది. సంక్షేమ పథకాలను అమలు చేసిన జగన్ కు 40 శాతం ఓట్లు వస్తే, చంద్రబాబు కూటమిలోని మూడు పార్టీలకు కలిపి అరవైశాతం ఓట్లు వచ్చాయి. అంటే జనం దేనిని నమ్ముతారో? వేటిని విశ్వసిస్తారన్నది ఎన్నికల సమయంలోనే తప్ప మిగిలిన రోజుల్లో బాకాలు ఊదినా ప్రయోజనం ఉండదన్న విషయం అర్థమయితే చాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏపీ ప్రజల మూడ్ ను అంచనా వేయడం కష్టమేనన్నది వారి అభిప్రాయంగా ఉంది.
Next Story