Mon Dec 23 2024 13:06:53 GMT+0000 (Coordinated Universal Time)
జేఎన్టీయూలో ర్యాగింగ్.. 12 మంది సస్పెండ్
ఒకేసారి 12 మంది విద్యార్థులపై ర్యాగింగ్ కారణంగా సస్పెన్షన్ వేటు పడటం.. జేఎన్టీయూ(ఏ) చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం
జేఎన్టీయూ (అనంతపురం) ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ భూతం రెచ్చిపోయింది. సీనియర్ విద్యార్థులు చేస్తున్న ఆగడాలను భరించలేని.. జూనియర్ విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేయగా.. 12 మందిని సస్పెండ్ చేశారు. అర్థరాత్రి వరకూ వెకిలి చేష్టలు, డ్యాన్సులు, అడ్డూ అదుపులేని అకృత్యాలను తట్టుకోలేకపోయిన బాధితులు తమ ఆవేదనను ప్రిన్సిపాల్ డాక్టర్ సుజాత వద్ద వెళ్లగక్కారు. దీంతో ఆమె 12 మంది కెమికల్, కంప్యూటర్ సైన్స్ గ్రూప్ కు చెందిన సెకండియర్ విద్యార్థులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.
ఒకేసారి 12 మంది విద్యార్థులపై ర్యాగింగ్ కారణంగా సస్పెన్షన్ వేటు పడటం.. జేఎన్టీయూ(ఏ) చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. నిజానికి సీనియర్, జూనియర్ విద్యార్థుల హాస్టళ్లు వేర్వేరుగానే ఉంటాయి. కానీ.. సీనియర్లు జూనియర్లను తమ హాస్టల్ కు పిలిపించి అర్థనగ్నంగా డ్యాన్సులు చేయించడమే కాక.. సిగరెట్లు, మద్యం తెచ్చివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తాము చెప్పిందే వినాలంటూ ఇబ్బందులకు గురి చేసినట్లు బాధితులు చెప్తున్నారు. కాగా.. హాస్టల్ లో ర్యాగింగ్ గురించి తెలియగానే అక్కడికి వెళ్లామని, అర్థరాత్రి ఒంటిగంట వరకూ అక్కడే ఉండి విద్యార్థులతో మాట్లాడినట్లు ప్రిన్సిపాల్ సుజాత తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొన్నారు.
Next Story