2 కిలోల చేప రూ 26 వేలు..
వర్షాకాలం వచ్చిందంటే ఉభయ గోదావరి జిల్లాల మత్స్యకారులు ఆ చేప కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఇక మాంసం ప్రియులైతే వేల రూపాయలు ఖర్చు పెట్టైనా ఈ ఏడాది ఆ చేప రుచి చూడాలనుకుంటారు
2 కిలోల చేప రూ 26 వేలు..
వర్షాకాలం వచ్చిందంటే ఉభయ గోదావరి జిల్లాల మత్స్యకారులు ఆ చేప కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఇక మాంసం ప్రియులైతే వేల రూపాయలు ఖర్చు పెట్టైనా ఈ ఏడాది ఆ చేప రుచి చూడాలనుకుంటారు. అది గోదావరి జిల్లాల్లో పులస బ్రాండ్. పుస్తెలమ్మైనా పులస కూర తినాలని గోదారోళ్లు ఎప్పుడో చెప్పారు. అందుకే దొరికింది ఒక్క చేప అయినా వేలంలో వేల రూపాయలు పెట్టి కొంటుంటారు. దీంతో ప్రతి ఏటా పులస కొత్త రికార్డులు సృష్టిస్తోంది.
తాజాగా యానాం వశిష్ట గోదావరిలో మత్స్యకారుల వలకు 2 కిలోల పులస చేప దొరికింది. ఈ చేపను వేలం వేయగా నాగలక్ష్మి అనే మహిళ ముందుగా 19 వేల రూపాయలకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత రావులపాలేనికి చెందిన ఓ వ్యక్తి ఆమె దగ్గరు 26 వేల రూపాయలకు ఆ పులసను కొనుగోలు చేశాడు. ఈ సీజన్లో పులసకు పలికిన అత్యధిక ధర ఇదేనని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. వర్షాకాలంలో సముద్రం నుంచి గోదావరి వరద నీటికి పులస చేపలు ఎదురీదుతాయి. ఈ చేపకు అంత ధర పలకడానికి రుచి ప్రధాన కారణమని మత్స్యకారులు అంటుంటారు. ఇటీవల కాలంలో పులస చేపలు చాలా తక్కువ సంఖ్యలో దొరుకుతున్నాయన్నారు.
ఈ పులస ధర ఒకప్పుడు వందల్లో ఉండేది ఇప్పుడు వేలల్లో పలుకుతోంది. ఒక్కసారి ఈ పులస రుచి చూసినవాళ్లు జీవితంలో మర్చిపోలేరని గోదారోళ్లు అంటుంటారు. సముద్రంలో జీవించే హిల్సా ఇలీషా అనే పేరు గల వలస జాతి చేపలు వర్షాకాలంలో గోదావరిలోకి చేరుతాయి. గోదావరి నీటిలో గుడ్లుపెట్టి సంతానోత్పత్తి చేసుకుంటాయి. అనంతరం మళ్లీ సముద్రంలోకి వెళ్లిపోతాయి. సముద్ర నీటిలో ఉండేటప్పుడు వీటిని విలస చేపలుగా పిలుస్తారు. అయితే వరద నీరు రాగానే ఎదురీదుకుంటూ గోదావరి చేరుతుంటాయి. గోదావరి నీటిలో ఈ చేపలను పులసగా పిలుస్తారు. వరద నీటికి ఎదురీదడం వల్ల ఈ చేపలు తమలోని ఉప్పు లవణాలు కోల్పోయి పులసగా మారుతాయి. దీంతో అత్యంత రుచికరంగా ఉంటుందని పులస ప్రియులు చెబుతారు.