Mon Dec 23 2024 14:37:29 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖలో ఆంత్రాక్స్ అలజడి.. 40 మందికి సోకిన వ్యాధి
బాధితుల నుంచి రక్త నమూనాలు సేకరించి వాటిని విశాఖ కేజీహెచ్ మైక్రో బయాలజీ విభాగానికి పంపుతామని వైద్య అధికారి విశ్వేశ్వర..
విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఆంత్రాక్స్ అలజడి రేపుతోంది. మొత్తం 40 మందికి వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ దొరగుడ గ్రామంలో ఈ వ్యాధి వ్యాపించింది. ఏజెన్సీ ఏరియాల్లో దాదాపు 40 మందికి ఆంత్రాక్స్ సోకగా.. వారిలో 15 మంది చిన్నారులే కావడం ఆందోళనకు గురిచేస్తోంది. వారంరోజులుగా బాధితులు కురుపులతో బాధపడుతున్నారు. దీంతో అప్రమత్తమైన వైద్య అధికారులు ఆయా ఏజెన్సీ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు పెట్టి బాధితుల నమూనాలను సేకరించి వైద్య సేవలు అందిస్తున్నారు.
బాధితుల నుంచి రక్త నమూనాలు సేకరించి వాటిని విశాఖ కేజీహెచ్ మైక్రో బయాలజీ విభాగానికి పంపుతామని వైద్య అధికారి విశ్వేశ్వరరావు తెలిపారు. మృతి చెందిన మేకలను తినటంతో ఈ వ్యాధి సోకినట్లుగా భావిస్తున్నారు. ఇదే దొరగుడలో గతంలోనూ ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలతో పదుల సంఖ్యలో చిన్నారులు మృత్యువాతపడ్డారు. తాజాగా.. గ్రామంలో ఓ చిన్నారికి ఏర్పడిన గాయాలను చూసి.. ఆశా కార్యకర్త ఫోటో తీసి వైద్యులకు పంపారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్.. గురువారం (ఆగస్టు 25,2022) దొరగుడలో.. ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటుచేశారు. 40 మందిలో ఏడుగురికి ఏడుగురికి తీవ్ర లక్షణాలు ఉన్నాయి. వారందరి నమూనాలను పరీక్షలకు పంపామని.. రిపోర్టులు వచ్చిన అనంతరం వ్యాధి తీవ్రతపై స్పష్టత వస్తుందని వైద్యులు తెలిపారు.
Next Story