Mon Dec 23 2024 09:44:44 GMT+0000 (Coordinated Universal Time)
విద్యార్థితో స్కూల్ కు సున్నం వేయించిన హెచ్ఎం.. ఎముకలు విరిగి ఆస్పత్రిపాలైన స్టూడెంట్
విద్యార్థినులను వేధించడం, విద్యార్థులను ఇష్టారాజ్యంగా కొట్టడం వంటి ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. తాజాగా..
ఇటీవల కాలంలో.. పాఠశాలల్లోనూ విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు, హెచ్ఎంలు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. విద్యార్థినులను వేధించడం, విద్యార్థులను ఇష్టారాజ్యంగా కొట్టడం వంటి ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. తాజాగా.. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొత్త గేటు ఎంపీపీ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలి నిర్వాకానికి విద్యార్థికి ఎముకలు విరిగి.. ఆస్పత్రి పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. శ్రామికనగర్ (కొత్తగేటు)లోని ఎంపీపీ పాఠశాలలో వేముల జోష్ అనే విద్యార్థి 5వ తరగతి చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం పాఠశాల ముగిసిన తర్వాత తన స్నేహితులతో కలిసి ఇంటికి వెళుతున్న సమయంలో స్కూలు హెడ్ మాస్టర్ పిలిచి స్కూలుకు సున్నం వేయాలని వేముల జోష్ తో మరో ముగ్గురిని పురమాయించారు.
సున్నం వేస్తున్న సమయంలో వేముల జోష్ పది అడుగుల పైనుంచి జారి కింద పడ్డాడు. దాంతో జోష్ కి మూడుచోట్ల ఎముకలు విరిగి.. ప్రస్తుతం విజయవాడలోని స్వర సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తమది మధ్యతరగతి కుటుంబమని, విద్యార్థికి చికిత్స చేయించలేని పరిస్థితుల్లో ఉన్నామని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇంత జరిగినా విషయం గోప్యంగా ఉంచే ప్రయత్నం చేసిన హెచ్ఎంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. హెచ్ఎంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
Next Story