Fri Nov 22 2024 21:27:46 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్సార్ జాబ్ మేళా.. తొలిరోజు 7 వేలకు పైగా నియామకాలు
వైఎస్ ఆర్ జాబ్ మేళాకు ఊహించిన దానికన్నా ఉద్యోగార్ధులు, తల్లిదండ్రుల నుండి ఎక్కువ స్పందన లభించిందని తెలిపారు.
గుంటూరు : ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాల్లో వేలమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించినట్లు వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి తెలిపారు. ఇప్పటికే విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో జాబ్ మేళాలు నిర్వహించగా.. శని, ఆదివారాల్లో గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీల్లో జాబ్ మేళా ఏర్పాటు చేశారు. రెండ్రోజులు జరిగే ఈ జాబ్ మేళాలో.. తొలిరోజు నియామకాలు పూర్తయ్యయి. శనివారం జరిగిన ఇంటర్వ్యూలలో 7,473 మంది నిరుద్యోగులు.. వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు. వారిలో ఇప్పటికే 373 మందికి నియామక పత్రాలు కూడా అందజేసినట్లు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
ఈ జాబ్ మేళాకు సంబంధించిన పూర్తి వివరాలను ఎంపీ విజయసాయి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వైఎస్ ఆర్ జాబ్ మేళాకు ఊహించిన దానికన్నా ఉద్యోగార్ధులు, తల్లిదండ్రుల నుండి ఎక్కువ స్పందన లభించిందని తెలిపారు. నిరుద్యోగులు అనడం కంటే ఉద్యోగార్ధులు అనడమే బాగుంటుందని అన్నారు. మొదట్లో మొత్తం 15 వేలు ఉద్యోగాలు ఇవ్వగలమని అనుకున్నామని, కానీ ఊహించిన దానికంటే ఇటు ఉద్యోగార్దులు, అటు కంపెనీల నుండి భారీ స్పందన రావడంతో మొదటి రెండు జాబ్ మేళాలలోనే 30 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించారు. ఏపీ విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం దేశవ్యాప్తంగా ఉందని, అభ్యర్దులు నాలుగైదు కంపెనీల ఇంటర్వ్యూ లకు హాజరు కావాలని సూచించారు. వచ్చిన ఉద్యోగాన్ని ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోకూడదని, వచ్చిన ఉద్యోగంలోనే తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని ఆయన సూచించారు. గతంలో జరిగిన జాబ్ మేళాలలో కనీసం 15 వేల జీతం నుండి లక్ష రూపాయల జీతం వరకు ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించారు.
తమ అర్హతకు తగిన ఉద్యోగం రాలేదన్న భావనతో వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోకూడదన్నారు. కంపెనీకి ఉత్తమ సేవలందిస్తామన్న భరోసా అభ్యర్దులు ఇవ్వగలగాలని, కంపెనీల వద్ద నుండి అభ్యర్దులు అశించిన విధంగానే కంపెనీలు కూడా వారి నుంచి అశిస్తాయని అన్నారు. బ్యాంకింగ్, ఐటీ, రిటైల్, మార్కెటింగ్, సేల్స్, నిర్మాణం, తదితర రంగాలకు చెందిన 210 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని ఆయన అన్నారు. జాబ్ మేళా ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్న విజయసాయి రెడ్డి.. ఉద్యోగాలు పొందలేని వారికి స్కిల్ డెవలప్ మెంట్ లో ట్రైనింగ్ ఇచ్చి తరుపరి జాబ్ మేళాకు సిద్దం చేస్తామని అన్నారు. ప్రస్తుత జాబ్ మేళాలో 97 వేల మంది రిజిస్టర్ చేసుకోగా 26 వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ కానున్నట్లు వెల్లడించారు.
ఈ జాబ్ మేళాలో ఇంటర్వ్యూలకు హాజరైన ప్రతి నలుగురిలో ఒకరికి ఉద్యోగం లభిస్తుందని తెలిపారు. ఉద్యోగార్థులకు సమాచారం అందించేందుకు 800 మందికి పైగా వాలంటీర్లు పనిచేస్తున్నారని, హెల్ప్ లైన్ సెంటర్లు, ఇన్ఫర్మేషన్ సెంటర్లు, ఏర్పాటు చేసిన్లు తెలిపారు. అలాగే.. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ.. మంచినీరు, మజ్జిగ, భోజనం సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు.
Next Story